Begin typing your search above and press return to search.

మంత్రి ఆదికి అదిరే కౌంట్ ఇచ్చిన జోగి

By:  Tupaki Desk   |   25 Oct 2017 9:49 AM GMT
మంత్రి ఆదికి అదిరే కౌంట్ ఇచ్చిన జోగి
X
కీల‌క‌స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వ‌చ్చే మాట‌ల‌కు ఉండే విలువ అంతాఇంతా కాదు. ఆ విష‌యాన్ని కొన్నిసంద‌ర్భాల్లో మ‌ర్చిపోతుంటారు స‌ద‌రు నేత‌లు. నిన్న‌టికి నిన్న ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మాట‌ల్నే చూస్తే.. తాను జ‌గ‌న్ పార్టీ నుంచి జంపింగ్ అయిన వెంట‌నే త‌న రాజీనామా లేఖ‌ను ఏపీ స్పీక‌ర్ కోడెల‌కు ఇచ్చిన‌ట్లుగా చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

తన ప‌ని తాను చేశాన‌ని.. త‌న రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ ఆమోదించ‌క‌పోతే తానేం చేయాలంటూ కోడెల‌కు కొత్త ఇబ్బందిని తెచ్చిపెట్టేలా వ్యాఖ్య‌లు చేసిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేయ‌నున్న పాద‌యాత్ర‌ను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రులు చేస్తున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ పార్టీ అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేశ్ రియాక్ట్ అయ్యారు.

ఏపీ మంత్రులు అడ్డ‌గోలుగా మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తిన ఆయ‌న‌.. మంత్రి ఆది త‌న రాజీనామా గురించి చెప్పార‌ని.. అయితే ఎప్పుడు రాజీనామా చేశావ్‌.. స్పీక‌ర్‌ కు లేఖ ఎప్పుడు ఇచ్చారో చెప్పాలన్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్ర‌బుద్ధుడ‌ని.. అలాంటి వ్య‌క్తి రాజీనామా చేసిన‌ట్లుగా చెబుతున్నార‌ని.. ఎప్పుడు చేశారో చెప్పాల‌న్నారు.

స్పీక‌ర్‌ కు రాజీనామా లేఖ‌ను ఎప్పుడు ఇచ్చారో చెప్పాల‌ని.. మ‌రి.. అప్ప‌టి నుంచి స్పీక‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు ఆమోదించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.మంత్రి ఆదికి నిజంగా ద‌మ్ము.. ధైర్యం కానీ ఉంటే తాను చేసిన రాజీనామాను ఆమోదించుకునేలా చేసుకొని ఉప ఎన్నిక‌కు రావాల‌ని స‌వాలు విసిరారు. మంత్రి ఆదితో పాటు ముఖ్య‌మంత్రి కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్‌ పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

420 అన్న వెంట‌నే ఏపీలో గుర్తుకు వ‌చ్చేది చంద్ర‌బాబేన‌న్న జోగి.. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు అని త‌ప్పులు లేకుండా ప‌ల‌క‌గ‌ల‌వా లోకేశ్ అని ప్ర‌శ్నించారు. అఆలు.. ఏబీసీడీలు రాని లోకేశ్ జ‌గ‌న్‌ ను విమర్శించ‌ట‌మా? అని ప్ర‌శ్నించిన జోగి.. మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల‌న్నారు. త‌న మీద మంత్రి దేవినేని ఉమ చేసిన ఆరోప‌ణ‌ల్ని నిరూపించాల‌ని.. 24 గంట‌ల్లో త‌న స‌వాలుకు స్పందించ‌కుంటే బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. మొత్తానికి తాము రాజీనామాలు చేసి.. ఆ లేఖ‌ల్ని స్సీక‌ర్‌కు ఇచ్చామంటూ మంత్రి ఆది చేసిన వ్యాఖ్య‌ల‌కు జోగి భారీ కౌంట‌ర్ ఇచ్చార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.