Begin typing your search above and press return to search.

లోకేశ్‌ ను జోగి రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టేశారు!

By:  Tupaki Desk   |   15 April 2017 11:59 AM GMT
లోకేశ్‌ ను జోగి రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టేశారు!
X
నిజ‌మే... ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కుమారుడిగానే కాకుండా... ఆయన కేబినెట్లో మూడు కీల‌క శాఖ‌ల మంత్రిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌... వైసీపీ కీల‌క నేత‌ - మాజీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్‌ కు అడ్డంగా దొరికిపోయారు. రాజ‌కీయాల్లో త‌మ స్థాయిలో పునీతులుగా ఉన్న ఫ్యామిలీ దేశ రాజ‌కీయాల్లోనే లేదంటూ నిత్యం ప్ర‌క‌ట‌న‌లు గుప్పించే నారా లోకేశ్ ను జోగి ర‌మేశ్ నిజంగానే అడ్డంగా బుక్ చేసేశారు. కాసేప‌టి క్రితం విజ‌యవాడ కేంద్రంగా మీడియాతో మాట్లాడిన జోగి ర‌మేశ్... న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో భూముల క్ర‌య విక్ర‌యాల‌ను నిలుపుద‌ల చేస్తూ జారీ చేసిన జీవోను ఆధారం చేసుకుని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.

సీఆర్‌ డీఏ ప‌రిధిలో జీవో నెం.44 జారీ చేసిన ప్ర‌భుత్వం... అక్క‌డ భూముల కొనుగోళ్ల‌పై పూర్తి స్థాయిలో నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. భూమి య‌జ‌మానులుగా ఉన్న రైతుల‌ను హ‌క్కుల‌ను కాల‌రాసేదిగా ఉన్న ఈ జీవోను ర‌ద్దు చేయాల‌ని నాడు వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసింది. అయితే రాజ‌ధాని పేరిట భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని, ఆ ప్ర‌మాదాన్ని నివారించేందుకు ఈ జీవోను జారీ చేశామ‌ని చెప్పిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైసీపీ డిమాండ్‌ ను తేలిగ్గానే కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు ఏ ఒక్క‌రూ అడ‌గ‌కున్నా కూడా ఆ జీవోను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లుగా సీఆర్‌ డీఏ ప్ర‌క‌టించింది.

అస‌లు ఈ జీవోను ఇప్ప‌టికిప్పుడు ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఏముంద‌న్న కోణంలో ఆరా తీసిన జోగి ర‌మేశ్... అస‌లు వాస్త‌వాలు ఇవేనంటూ బ‌య‌ట‌పెట్టారు. జోగి ర‌మేశ్ వాద‌న ప్ర‌కారం.... జీవో నెం.44ను ఆస‌రా చేసుకుని రైతుల నుంచి ఇత‌రులు భూములు సేక‌రించకుండా అడ్డుకోగ‌లిగిన టీడీపీ పెద్ద‌లు... తాము అనుకున్న మేర మాత్రం భూముల‌ను కొనుగోలు చేసుకున్నార‌ట‌. కొనుగోలు అంటే పూర్తిగా కాదు గానీ... అగ్రిమెంట్లు అయితే ప‌క్కాగా జ‌రిగాయ‌ట‌. తాము అనుకున్న ల‌క్ష్యం మేర భూములు చేతికంద‌గానే ఈ జీవో అవ‌స‌రం లేదన్న భావ‌న‌తోనే టీడీపీ నేత‌లు ఈ జీవోను ఎత్తివేయించిన‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు.

ఈ క్ర‌మంలో జోగి ర‌మేశ్ ఓ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఈ జీవో ర‌ద్దుపై చ‌ర్చించేందుకు భేటీ అయిన సీఆర్‌ డీఏ స‌మావేశానికి నారా లోకేశ్ హాజ‌ర‌య్యార‌ని ఆయ‌న చెప్పారు. సీఆర్‌ డీఏలో స‌భ్యుడు కూడా కాని నారా లోకేశ్ ఈ స‌మావేశానికి ఎలా వెళ్లార‌ని కూడా జోగి ప్ర‌శ్నించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచార‌ణ చేయించి వాస్త‌వాల‌ను నిగ్గు తేల్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మ‌రి జోగి చేసిన డిమాండ్ మేర‌కు సీఆర్డీఏ క‌మిటీ భేటీకి లోకేశ్ వెళ్లిన విష‌యాన్ని టీడీపీ స‌ర్కారు ఒప్పుకుంటుందా? లేక కొత్త వాద‌న‌ను తెరపైకి తెస్తుందా? అన్న అంశంపై ఇప్పుడు పెద్ద చ‌ర్చే మొద‌లైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/