Begin typing your search above and press return to search.

లోకేష్‌..పేరుకు త‌గ్గ‌ట్లు లోక‌జ్ఞానం పెంచుకో!

By:  Tupaki Desk   |   5 July 2017 4:50 PM GMT
లోకేష్‌..పేరుకు త‌గ్గ‌ట్లు లోక‌జ్ఞానం పెంచుకో!
X
త్వ‌ర‌లో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి జైలుకు పోనున్నార‌ని జోస్యం చెప్పిన ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోర్టుల ప‌రిధిలో ఉన్న అంశాన్ని చంద్ర‌బాబు ఎలా ప్ర‌స్తావిస్తార‌ని ర‌మేశ్ ప్ర‌శ్నించారు. అవినీతి గురించి ప‌దేప‌దే అనవసరంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద అభాండాలు వేసిన బాబు.. తను అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఏదైనా నిరూపించగ‌లిగారా అని ప్రశ్నించారు. త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనసుల్లో చంద్రబాబు ఎప్పుడో జైలుకు వెళ్లారని జోగి ర‌మేశ్ అన్నారు.

తెలుగుదేశం పార్టీ ప‌రిపాల‌న అంటే అవినీతికి అక్ర‌మాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింద‌ని జోగి ర‌మేశ్ మండిప‌డ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబు పెద్ద ఎత్తున అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతుంటే ఆయ‌న బాట‌లోనే నేత‌లు న‌డుస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు సార‌థ్యంలోని హెరిటేజ్ సంస్థ‌ వాహనాల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడటం చూస్తే అధికార పార్టీ నాయ‌కుడు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నాడో అర్థమ‌వుతోంద‌న్నారు. ఆయ‌న బాట‌లోనే న‌డుస్తూ విశాఖలో లక్ష ఎకరాల భూమిని టీడీపీ నేతలు మింగారని ఆరోపించారు. ఈ భూముల విష‌యంలో సీబీఐ ద‌ర్యాప్తు అంటే బాబు వ‌ణికిపోతున్నార‌ని జోగి రేమేశ్ అన్నారు. త‌ప్పు చేయ‌క‌పోతే ఎందుకు అంత భయమని ప్ర‌శ్నించారు. చంద్రబాబుకు అల్జీమర్స్‌ వ్యాధి వచ్చినట్లు అనుమానంగా ఉందని, లేకపోతే ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి అలా ఎందుకు మాట్లాడతారని అన్నారు. వ్యాధి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని జోగి ర‌మేశ్ ఎద్దేవా చేశారు.

మ‌ద్య‌పానాన్ని స‌మ‌ర్థించ‌డ‌మే కాకుండా బీరు హెల్త్ డ్రింక్‌ అంటూ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ సంద‌ర్భంగా జోగి ర‌మేశ్ మండిప‌డ్డారు. మంత్రి స్థాయిలో ఆ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సినవిగా లేవని అన్నారు. సాక్షాత్తు ముఖ్య‌మ‌త్రి త‌న‌యుడు అయిన మంత్రి లోకేష్‌ జవహర్‌ మాటలను సమర్ధించడం సిగ్గుచేటన్నారు. లోకేష్‌ పేరులో ఉన్న లోకజ్ఞానం ఆయనకు లేదని విమర్శించారు. విచ్చ‌ల‌విడిగా తాగుడును ప్రోత్స‌హిస్తున్న ఈ ఇద్ద‌రు మంత్రులు పదవులకు రాజీనామా చేసి సేల్స్‌ మేనేజర్లుగా మారాలని జోగి ర‌మేశ్‌ ఎద్దేవా చేశారు.