Begin typing your search above and press return to search.

ఏ మాటకు ఆ మాటే.. హద్దులు మీరిన అయ్యన్న.. అంతకు మించినట్లుగా జోగి

By:  Tupaki Desk   |   18 Sep 2021 4:32 AM GMT
ఏ మాటకు ఆ మాటే.. హద్దులు మీరిన అయ్యన్న.. అంతకు మించినట్లుగా జోగి
X
కదిలే కాలంతో పాటు రాజకీయాలు.. విలువలు అంతకంతకూ దిగజారిపోతున్న పరిస్థితి. మీడియాలో మరింత బాగా కనిపించాలనో.. తన ఇమేజ్ ను పెంచుకోవాలనో.. లేదంటే ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరించే తీరుతో కనీస గౌరవ మర్యాదలు మిస్ అవుతున్న ఇబ్బందికర పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోంది. ఈ తీరుకు పరాకాష్ఠగా గడిచిన రెండు రోజుల్లో ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు నిదర్శనంగా చెప్పక తప్పదు. రాజకీయాల్లో అధిక్యతను ప్రదర్శించుకోవటం తప్పేం కాదు. తమ రాజకీయ ప్రత్యర్థులపై అధిక్యతను ప్రదర్శించుకునే క్రమంలో హద్దులు దాటేయటం.. పరిమితుల గీతల్ని తుడిపేయటం ఎవరికి ఎంతమాత్రం మంచిది కాదు.

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి విషయానికే వస్తే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయటమే కాదు.. రాయటానికి వీల్లేని రీతిలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉన్నా.. ఆయన నిర్ణయాలు ఎంత తప్పుడుగా ఉన్నా.. అలా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం సంస్కారం కాదన్న విషయాన్ని అయ్యన్న అర్థం చేసుకోవాలి. సీనియర్ నేతగా ఉండి కూడా సంయమనం పాటించాల్సింది పోయి.. రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సబబు?

జగన్ పాలనను తప్పు పట్టాలని భావిస్తే.. అందుకు తగ్గట్లు వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ.. బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా తిట్టేసే సాదాసీదా వ్యక్తుల తరహాలో విరుచుకుపడటం అర్థం లేనిది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఈ మొత్తం రచ్చ అయ్యన్న మాటలతో మొదలైందని చెప్పాలి. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయన తీరును ఖండించాలి.. ఆయన నివాసం వద్ద నిరసన చేపట్టాలని.. లేదంటే ఆయన ఇంటిని ముట్టడించాలి. అందుకు భిన్నంగా అయ్యన్న ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి చెందిన అధినేత ఇంటిని ముట్టడికి పిలుపునివ్వటం కొత్త తరహా రాజకీయమని చెప్పక తప్పదు.

మాటలతో అయ్యన్న రెచ్చిపోతే.. నువ్వు తమలపాకుతో ఒకటిస్తే.. నేను తలుపుచెక్కతో రెండిస్తా అన్న చందంగా క్రిష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ తీరు ఉందని చెప్పాలి. అయ్యన్న మాటలతో రెచ్చిపోతే.. జోగి చేతలతో చెలరేగిపోయారు. ఆ మాటకు వస్తే.. అయ్యన్న తప్పు చేస్తే.. జోగి అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించి ఇష్యూను మరింత జటిలం చేశారని చెప్పాలి. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు సైతం తమ అంతర్గత సంభాషణల్లో విస్మయం వ్యక్తం చేయటమే కాదు.. ‘ఆయనకు ఏమైంది? అంత సీనియర్ నేత అలా మాట్లాడటం ఏమిటి? గౌరవ మర్యాదల్ని పూర్తిగా వదిలేయటమా? బాధ్యత అంటూ లేదా? మాటలతో అయ్యన్న ఓవరాక్షన్ చేశారు’ అన్న వ్యాఖ్యలు వినిపించాయి.

అయ్యన్న విమర్శలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైన వేళ.. అది కాస్తా సీఎం జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా.. సానుభూతి పెంచేలా ఉందని చెప్పాలి. అలాంటి వేళ.. జోగి రమేశ్ చేతలతో చేసిన పనికి ఆ మైలేజీమొత్తం పోవటమే కాదు.. ఆరాచకానికి తెర తీసిన ముద్ర ఆయనపైన పడింది. అధికారపార్టీ శాంతిభద్రతలకు చిక్కులు తెచ్చేలా వ్యవహరించటం ఏమిటన్న వాదన తెర మీదకు తీసుకొచ్చేలా చేసింది. ఏమైనా.. దొందూ దొందే అన్నట్లుగా అయ్యన్న.. జోగి రమేశ్ తీరు ఉందని చెప్పక తప్పదు.