Begin typing your search above and press return to search.

జనసేన అజెండా సెట్ చేసిన జోగయ్య...?

By:  Tupaki Desk   |   12 March 2023 10:00 PM GMT
జనసేన అజెండా సెట్ చేసిన జోగయ్య...?
X
ఏపీలో రాజకీయాలు ఒక్క లెక్కన వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికలనే కీలకంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇపుడు కాకపోతే మరెపుడూ అన్న ఆలోచనలతోనే అన్ని పార్టీలు ఉన్నాయి. ముందుగా వైసీపీ విషయానికి వస్తే నాలుగు దశాబ్దాలుగా ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశాన్ని ఈసారి కూడా ఓడిస్తే ఇక ఆ పార్టీ చరిత్ర పుటలకే పరిమితం అవుతుందని తమ మూడు దశాబ్దాల అధికారం కలలు నెరవేరుతాయని భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే తెలుగుదేశం కూడా చావో రేవో అన్నట్లుగా పోరాడుతోంది. ఆ పార్టీకి 2024 ఎన్నికలు చాలా ముఖ్యం. ఈసారి నిజంగా ఓడితే ఇక తమకు ఏపీ పొలిటికల్ తెర మీద రాజకీయం చేయడం ఇబ్బంది అవుతుంది అన్నది కూడా ఒక ఆలోచన ఉందని అంటారు. దాంతో ఈసారి ఎన్నికల్లో గెలుపే తప్ప ఓటమి అన్న మాట వినిపించకూడదు అని తెలుగుదేశం అధినాయకత్వం పట్టుదల మీద ఉంది.

ఇక ఇపుడు మూడవ పక్షంగా ఉన్న జనసేన విషయానికి వస్తే ఆ పార్టీని థర్డ్ ఫోర్స్ గా మారమని బలమైన కాపు సామాజికవర్గం నుంచి వత్తిడి వస్తోంది. కాపులు ఏపీలో పాతిక శాతం ఓటు బ్యాంక్ గా ఉన్నారని, అదే విధంగా బడుగులు వెనకబడిన వర్గాల వారు అంతా కలుపుకుంటే ఎనభై శాతం మంది ఉన్నారని కాపుసేన నాయకుడు మాజీ మంత్రి హరిరామజోగయ్య అంటున్నారు. ఆయన ఈ రోజు మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశానికి స్వయంగా రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది.

అయితే జనసేన ఆఫీసులో హరిరామజోగయ్య ఒక షార్ట్ ఫిల్మ్ ని కూడా వేసి పవన్ కి చూపించారు అని అంటున్నారు. అందులో ఎనభై శాతం ఉన్న వర్గాలు ఇరవై శాతం ఉన్న వారిని అధికారం కోసం యాచించడం ఏంటి అన్న దాన్ని గట్టిగా ముందుకు తెచ్చారు. అంటే క్లియర్ గా అర్ధమయ్యేది ఏంటి అంటే కాపులు ఇతర కులాల సాయంతో ఏపీలో మూడవ శక్తిగా ఎదగాలన్నదే జోగయ్య ఆలోచన అంటున్నారు. ఇక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన జోగయ్య అయితే వైసీపీతో సమానంగా టీడీపీని విమర్శించమని కోరడం సంచలనం రేపుతోంది.

ఏపీలో విపక్ష నాయకుడు అధికారం కోసం వ్యూహాలను రూపొందించుకుంటున్నారు అని ఆయన చంద్రబాబు మీద పరోక్ష విమర్శలు చేయడమూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర వైఖరితోనే ముందుకు సాగడం మంచి పరిణామం అని జోగయ్య చెప్పడమే ఇక్కడ కీలకంగా ఉంది. ఆయనే కాదు ఈ సమావేశంలో మాట్లాడిన చాలా మంది కాపు నాయకులు కూడా టీడీపీతో పొత్తు కంటే సొంతంగా జనసేన పోటీ పడాలని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆచీ తూచీ మాట్లాడారు అని అంటున్నారు. ఆయన ఈ సందర్భంగా చెప్పిన మాటలను పరిశీలిస్తే కాపుల గౌరవం తగ్గించనని హామీ ఇచ్చారు. అదే టైం లో కాపులు తనకు ఓట్లు వేయలేదని, వారే కనుక ఓటేస్తే తాను భీమవరం, గాజువాకలలో ఎందుకు ఓడిపోతాను అని ప్రశ్నించారు. అంతే కాదు తాను సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకున్నారు.

మొత్తానికి పవన్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆ మధ్య ఎచ్చెర్లలో జరిపిన యువశక్తి మీటింగులో మాట్లాడిన దానికి కొనసాగింపుగానే ఉన్నాయని ఒక విశ్లేషణ వినిపిస్తోంది. ఆనాటి సభలో కూడా గౌరవప్రదమైన తీరులో ఉంటేనే పొత్తులు ఉంటాయి లేకపోతే మన దాని మనదే అన్నట్లుగా నాడు ఆయన మాట్లాడారు. ఇపుడు అదే ఆయన చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే ఏపీలో తెలుగుదేశంతో జనసేన పొత్తులకు ఇపుడు ఒక బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలు అడ్డంకిగా మారుతాయని అంటున్నారు. పవన్ ఈ విషయంలో ఏమి చేస్తారో చూడాలని అంటున్నారు. అయితే జనసేనకు ఒక అజెండాను సెట్ చేయడంతో మాత్రం జోగయ్య కొంతవరకూ సక్సెస్ అయ్యారనే అంటున్నారు. మరి పెద్దాయన, పవన్ కళ్యాణ్ ఎక్కువగా గౌరవించే జోగయ్య చెప్పిన బాటలోనే నడుస్తారా అంటే ఈ నెల 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభతో ఆ సంగతి తేలుతుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.