Begin typing your search above and press return to search.

కొత్తపాట ఎత్తుకున్న జోగయ్య

By:  Tupaki Desk   |   10 May 2022 11:59 AM IST
కొత్తపాట ఎత్తుకున్న జోగయ్య
X
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కొత్త పాట అందుకున్నారు. చేగొండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గట్టి మద్దతుదారుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ బలోపేతానికి, పవన్ తీసుకోవాల్సిన నిర్ణయాలపై జోగయ్య ఇప్పటికే అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే వీటిల్లో ఏ ఒక్కదాన్నీ జనసేన పట్టించుకోలేదు. పవన్ కానీ జనసేన నేతలు కానీ జోగయ్యను ఏమాత్రం పట్టించుకోరు.

అలాంటి జోగయ్య తాజాగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు పెట్టుకుంటే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారంటు జోస్యం చెప్పారు. ఇంతకాలం జనసేన గురించి మాత్రమే జోగయ్య మాట్లాడేవారు.

తెలుగుదేశంపార్టీ, బీజేపీ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కూడా జోగయ్య ఎప్పుడూ సూచించినట్లు లేదు. నిజానికి కాపు సంక్షేమ సేన అనే సంస్ధను పెట్టుకున్న జోగయ్య ఆ సంస్థ బలోపేతానికి చేస్తున్నది కూడా ఏమీలేదు.

దాదాపు 86 ఏళ్ళ వయసులో ఉన్న జోగయ్య గతంలో మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. వయసు రీత్యా జోగయ్య బయట తిరిగి చేసే పనులు కూడా పెద్దగా ఏమీ ఉండవు. అందుకనే కాపు సంఘాలు కానీ కాపు సామాజిక వర్గం లో ప్రముఖలు కానీ జోగయ్యను పెద్దగా కలుపుకోరు. ఎందుకంటే ఈయన ఎవరితోను, ఏ సంస్ధలో కూడా ఇమడలేరు. ఎక్కడ ఉన్నా తన మాటే నెగ్గాలనే పట్టుదల వల్లే చాలామంది ఈయనకు దూరంగా ఉంటారు.

అలాంటి జోగయ్య హఠాత్తుగా తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని పవన్ కు ఎందుకు సూచిస్తున్నారో అర్థం కావటంలేదు. ఇంతకాలం జోగయ్య అసలు టీడీపీ ఊసే ఎత్తింది లేదు.

తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వేడి తదితరాలను చూసిన తర్వాత జోగయ్య పై మూడు పార్టీలు కలవాలని కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. పనిలో పనిగా అధికారంలోకి వస్తే రైతులకు ఏ విధంగా మేలు చేయబోతున్నామనే విషయాన్ని వివరించాలనే విలువైన సూచన చేశారు. మరి పవన్ దాన్ని స్వీకరిస్తారా ?