Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్ ట్వీట్ల మర్మమేంటి?

By:  Tupaki Desk   |   24 Sep 2020 3:00 PM GMT
ఆ క్రికెటర్ ట్వీట్ల మర్మమేంటి?
X
జోఫ్రా ఆర్చర్.. వెస్టిండీస్‌లో పుట్టి ఇంగ్లాండ్‌కు ఆడుతున్న ఆల్ రౌండర్. తన ఆటతో ఎంతగా వార్తల్లో నిలుస్తుంటాడో.. అంతకుమించి తన ట్వీట్లతో హాట్ టాపిక్‌గా మారుతుంటాడు ఈ ఆర్చర్. అతడి చేతిలో భవిష్యవాణి ఏమైనా ఉందా అన్నట్లుగా అనిపిస్తాయి తన ట్వీట్లు. భవిష్యత్‌లో జరిగే పరిణామాల్ని ముందే ఊహించినట్లుగా ఆర్చర్ గతంలో పెట్టిన ట్వీట్లు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. ఐపీఎల్‌లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఆర్చర్.. మొన్న చెన్నైతో మ్యాచ్‌లో ఎంగిడి వేసిన చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో మొత్తం 30 పరుగులు వచ్చాయి. ఐతే అతను 2014లోనే 6666 అంటూ అంకెలతో ఒక ట్వీట్ వేయడం విశేషం. ఆ తర్వాతి ఏడాది ‘ఒక ఓవర్లో 30 పరుగులు’ అంటూ మరో ట్వీట్ వేశాడు. కేవలం ఈ రెండు ట్వీట్లు మాత్రమే నిజమై ఉంటే యాదృచ్ఛికం అనుకోవచ్చు. కానీ గతంలో అతను వేసిన మరెన్నో ట్వీట్లకు తగ్గట్లుగా తర్వాతి కాలంలో పరిణామాలు జరగడం విశేషం.

ఇండియాలో లాక్ డౌన్ మొదలైన కొత్తలో ప్రధాని నరేంద్ర మోడీ దీపాలు వెలిగించమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ అర్థం వచ్చేలా గతంలోనే ఒక ట్వీట్ వేశాడు. అలాగే కరోనా గురించి, లాక్ డౌన్ గురించి సంకేతాలు ఇచ్చేలా కూడా అతను గతంలో ట్వీట్లు వేయడం విశేషం. ఇంతే కాదు.. పెట్రోల్ ధరల పెంపు, చెన్నై జట్టుకు రైనా దూరం కావడం, టీ20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్‌ను కార్లోస్ బ్రాత్‌వైట్ సిక్సర్లు బాది గెలిపించడం, దక్షిణాఫ్రికా జట్టుకు డివిలియర్స్ దూరం కావడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా భవిష్యత్ పరిణామాలకు లింక్ చేసుకునేలా ఆర్చర్ ట్వీట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి సంబంధించి ఆర్చర్ ఎప్పుడో ట్వీట్ చేసి ఉంటాడని అతడి టైమ్ లైన్‌ను జనాలు జల్లెడ పడుతున్నారంటే.. వాటిని బయటికి తీసి వైరల్ చేస్తున్నారంటూ అతను ఎంతగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఈ ట్వీట్లు మరీ సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని.. చాలా వరకు యాదృచ్ఛికంగా జరిగినవే అని హేతువాదులు అంటున్నారు.