Begin typing your search above and press return to search.

జోబైడెన్ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుండగా అపశృతి

By:  Tupaki Desk   |   24 Jan 2021 7:00 AM GMT
జోబైడెన్ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుండగా అపశృతి
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ పదవి దిగిపోకుండా చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు.. ఏకంగా తన మద్దతుదారులతో అమెరికన్ పార్లమెంట్ పైనే దాడి చేయించాడనే ఆరోపణలున్నాయి.. జోబైడెన్ ను అధ్యక్షుడిగా గుర్తించక గద్దెదిగనంటూ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.

ఇంత జరిగాక కూడా ట్రంప్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని అమెరికాలో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొత్త అధ్యక్షుడు జోబైడెన్ వైట్ హౌస్ లోకి అధికారికంగా అడుగుపెట్టే రోజున ట్రంప్ చివరిసారిగా తన వక్రబుద్దిని బయటపెట్టాడని తాజా కథనాల ద్వారా తెలుస్తోంది.

జోబైడెన్ అమెరికా అధ్యక్ష భవనంలోకి అధికారికంగా అడుగుపెట్టే రోజున అపశృతి చోటుచేసుకుందని అక్కడి మీడియా చెబుతోంది.

తాజాగా వైట్ హౌస్ లోకి జోబైడెన్ దంపతులు రాగానే వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ మాన్షన్ తలుపులు తెరుచుకోకపోవడంతో వారు అక్కడే కొద్ది క్షణాలపాటు నిలబడిపోవాల్సి వచ్చిందని.. దీనివెనుక ట్రంప్ ఉన్నారన్నది ఈ వార్తల సారాంశం.

స్వాగతం పలికే కీలక అధికారిని ట్రంప్ విధుల్లోంచి తొలగించారని తెలిసింది. అలాగే వైట్ హౌస్ లోని బట్లర్ ను ఇంటికి పంపించాడు. దీంతో జోబైడెన్ దంపతులు వైట్ హౌస్ కు వచ్చేసరికి తలుపులు తీసేవారు కరువై ఇబ్బంది పడ్డారని అక్కడి మీడియా చెబుతోంది. దీనికంతటికి ట్రంప్ వేసిన ముందస్తు ప్లాన్ అని చెబుతున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.