Begin typing your search above and press return to search.

బైడెన్ తాజా ఆయుధం.. మనమ్మాయ్! అదెలానంటే?

By:  Tupaki Desk   |   22 Aug 2020 11:30 PM GMT
బైడెన్ తాజా ఆయుధం.. మనమ్మాయ్! అదెలానంటే?
X
బలహీనతను బలంగా మార్చుకుంటే.. అంతకు మించిన వ్యూహం ఇంకేం ఉంటుంది. ట్రంప్ లాంటి మొండిఘటం మీద పోటీ అంటే మాటలు కాదు. తన గెలుపు కోసం దేనికైనా సై అనేలా వ్యవహరించే ఆయన లాంటి నేతకు డెబ్భై ఏడేళ్ల పెద్ద మనిషి సవాలు విసరటం అంత తేలికైన విషయం కాదు. ఏది ఏమైనా.. మరోసారి తాను అమెరికా అధ్యక్షుడి కుర్చీలో కూర్చోవాలన్న పంతంలో ఉన్న వేళ.. ఆయన్ను ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. అందుకేనేమో.. ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న మనమ్మాయి కమలా హ్యారీస్ ను ఆయుధంగా చేసుకుంటున్నారు బైడెన్.

మీరెప్పుడైనా ట్రంప్ మాటల్ని వింటే.. ఆయన నోటి వెంట ఉపాధ్యక్షుడి ఊసే రాదు. అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికకు ఉన్నంత ప్రాధాన్యత కాకున్నా.. కాస్త తక్కువే అయినా.. కొట్టిపారేయలేనంతగా ఉపాధ్యక్ష ఎన్నికకు ప్రాధాన్యత ఉంది. కమల హ్యారీస్ ను ఎప్పుడైతే ఉపాధ్యక్ష పదవికి బరిలోకి దించారో.. అప్పటి నుంచి ఆమె బలాన్ని తన బలంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బైడెన్.

కమల అభ్యర్థిత్వం ట్రంప్ ను ఎంతలా చిరాకు తెప్పించిందో.. ఆయన స్పందించే తీరును చూస్తేనే అర్థమవుతుంది. ఈ విషయాన్ని జోబైడెన్ బాగానే గుర్తించారని చెప్పాలి. తాను పాల్గొనే ఎన్నికల ప్రచార సభల్లో కమలా హ్యారీస్ గురించి తప్పనిసరిగా ప్రస్తావించటమే కాదు.. ఆమెను విపరీతంగా పొగిడేస్తున్నారు. తాజాగా ఆయన ప్రసంగాన్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

కమలా హ్యారీస్ ది శక్తివంతమైన గళంగా అభివర్ణించిన బైడెన్.. భారతీయ.. నల్లజాతి మూలాలు ఉన్నప్పటికీ ఆమె ఎప్పటికి అమెరికనేనని పేర్కొన్నారు. తనని తాను అమెరికన్ గా నిరూపించుకోవటానికి ఆమె ఎన్నో అడ్డంకుల్ని అధిగమించారన్న ఆయన.. ‘‘ఒక మహిళ.. నల్లజాతి మహిళ. దక్షిణాసియా అమెరికన్.. వలసదారు.. ఇవన్నీ ఆమె ఎదుగుదలకు అడుగడుగునా అవరోధాలు కల్పించాయి. వాటన్నింటినీ దాటుకుంటూ.. అత్యంత శక్తివంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. అమెరికా ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా అధ్యక్ష పదవిని అందుకోవటానికి తాను ఒక్కడే పోరాడనక్కర్లేదని.. తన వెన్నంటి అతి గొప్ప ఉపాధ్యక్ష అభ్యర్థి ఉన్నారు’’ అని అన్నారు. ఈ మాటల్ని చూస్తే.. మనమ్మాయి మీద బైడెన్ ఆధారపడిన వైనం కనిపించక మానదు.

ప్రస్తుత పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ.. ట్రంప్ వైఫల్యాల్ని సింఫుల్ గా తేల్చేస్తున్నారు బైడెన్. అమెరికా చరిత్రలోనే ఇవి అత్యంత చీకటి రోజులని.. సమాజం రెండుగా విడిపోయిందని.. ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయన్న ఆందోళనను వ్యక్తం చేశారు. తనకు కానీ అధికారాన్ని అప్పగిస్తే.. తనలోని అత్యుత్తమ పని తీరును చూస్తారన్నారు. తానో కాంతి పుంజంలా మారి.. అమెరికా చీకట్లను పారదోలుతానంటూ అభయమిచ్చారు. కరోనాను ఎదుర్కోవటంలో ప్రభుత్వం ఫెయిల్ కావటంతో.. ఆర్థికంగా గ్రేట్ డిప్రెషన్ ను మించిన సంక్షోభంలోకి పడిపోయామన్న ఆయన.. జాతివివక్ష విషయంలో 1960లోకి వెళ్లిపోయామని వ్యాఖ్యానించటం గమనార్హం.