Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షుల వారి తాజా హెచ్చరిక విన్నారా?

By:  Tupaki Desk   |   2 Aug 2022 5:14 AM GMT
అమెరికా అధ్యక్షుల వారి తాజా హెచ్చరిక విన్నారా?
X
టైటిల్ కు తగ్గట్లు సినిమా ఉంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. తాజాగా అమెరికా అధ్యక్షుల వారి మాటలు వింటే.. ప్రపంచానికి పెద్దన్న అన్న టైటిల్ కు సరిగ్గా సూట్ అయ్యేలా ఆయన మాటలు ఉన్నాయనిపించక మానదు.

ప్రపంచం ఏమైనా పోయినా.. తమ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని భావించే అమెరికా.. తనకెంత మిత్రుడు అయినప్పటికీ తన ప్రయోజనాల్ని పణంగా పెట్టేందుకు ససేమిరా అంటుంది. అదే సమయంలో తమకు హాని కలిగించే వారిని వెంటాడి వేటాడి మరీ వధించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించే అమెరికా.. తాజాగా అల్ ఖైదా చీఫ్ ను తమ సైనిక బలగాలు ఏసేసినట్లుగా ప్రకటించారు.

అధ్యక్షుల వారు కీలక ప్రకటన చేస్తారంటూ వైట్ హౌస్ ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేయటం.. ఆ వెంటనే మీడియాలో అల్ ఖైదా చీఫ్ ను అమెరికా బలగాలు హతమార్చిన విషయాన్ని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్ లు వేశారు. కాబుల్ లో జరిపిన డ్రోన్ దాడులో జవహరీని అంతమొందించినట్లుగా పేర్కొన్నారు. ఈ వార్తలకు తగ్గట్లే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా అమెరికా ప్రజల జీవితాలు ఎంత విలువైనవన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారు. ‘అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్నా పట్టుకుంటాం. ఎంత కాలమైనా.. ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా చెప్పే జవహరీ తలపై అమెరికా 25 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.

బిన్ లాడెన్ ను హతమార్చిన తర్వాత అల్ ఖైదా పగ్గాల్ని జవహరీ చేపట్టారు. తాజా ప్రకటనతో ప్రపంచానికి జోబైడెన్ కీలక హెచ్చరిక చేసినట్లుగా చెప్పాలి. ఎవరైనా సరే.. అమెరికన్లకు హాని కలిగించాలన్న ఆలోచనను తాము తీవ్రంగా పరిగణిస్తామని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.