Begin typing your search above and press return to search.

ట్రంప్ కు దిమ్మ తిరిగేలా బైడన్ హెచ్ 1బీ వీసా పాలసీ

By:  Tupaki Desk   |   16 Aug 2020 7:30 AM GMT
ట్రంప్ కు దిమ్మ తిరిగేలా బైడన్ హెచ్ 1బీ వీసా పాలసీ
X
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికర ప్రకటనలకు వేదికగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కొన్ని తీవ్ర విమర్శలు.. ఆరోపణలతో పాటు.. పలు దేశాలకు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులు వ్యవహరించిన తీరుకు భిన్నంగా ట్రంప్ తీరు ఉందన్న వాదనకు తగ్గట్లే.. ఆయన అనుసరించిన వీసా విధానం ఉన్న విషయం తెలిసిందే. అగ్ర రాజ్యంగా నిత్యం వల్లించే ప్రపంచీకరణకు భిన్నంగా.. అమెరికా.. అమెరికా అంటూ ట్రంప్ మాటలకు ఆ దేశంలోని పారిశ్రామికవేత్తలు సైతం పెదవి విరవటం తెలిసిందే.

మొన్నటికి మొన్న హెచ్ 1బీ వీసా విధానంపై సరికొత్త ఆంక్షలు తీసుకురావటం.. ఆ నిర్ణయంపై వ్యతిరేకత పెరిగిన వైనాన్ని గుర్తించిన ట్రంప్.. తాజాగా వెనక్కి తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ టీం తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే సరికొత్త వీసా విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. హెచ్ 1బీ వీసా వ్యస్థను పూర్తిగా ప్రక్షాళన చేయటమే కాదు.. ఇప్పటివరకు అనుసరిస్తున్న కోటా విధానానికి చెక్ చెబుతామని చెబుతున్నారు.

దేశాల వారీగా ఉండే కోటా వ్యవస్థను తాము సమూలంగా ప్రక్షాళన చేస్తామని చెప్పటంతో పాటు.. కుటుంబ ఏకీకరణకు మద్దతు ఇస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా చేసిన ప్రకటన భారతీయ అమెరికన్లను ఉద్దేశించి చేసిందన్న మాట వినిపిస్తోంది. అది కూడా ప్రకటన చేసింది కూడా పంద్రాగస్టు కావటంతో.. అమెరికన్ భారతీయులకు శుభ సంకేతాన్ని ఇచ్చేందుకే ఈ ప్రకటన ఉందంటున్నారు.

ఇప్పటివరకు ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తూ.. ఇబ్బంది పెడుతున్న ట్రంప్ సర్కారుకు భిన్నంగా తమ విధానాలు ఉంటాయన్న విషయాన్ని జో బైడెన్ వర్గం తాజా ప్రకటనతో స్పష్టం చేసిందని చెప్పాలి. వీసా వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకంగా విధాన పత్రాన్ని విడుదల చేయటం.. అందులో విదేశాల నుంచి వచ్చే వారికి అనువుగా అంశాలు ఉండటం బైడెన్ కు లాభం చేకూరుతుందని చెబుతున్నారు. తమ ప్రభుత్వంలో కుటుంబ ఆధారిత వలస విధానానికి ప్రోత్సాహం లభిస్తుందని చెబుతున్న డెమొక్రాట్ల మాటలు వలసజీవుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఈ పరిణామాలు ట్రంప్ కు ఇబ్బందికరంగా మారతయాన్న వాదన వినిపిస్తోంది.