Begin typing your search above and press return to search.

నోరు మూసుకో .. ట్రంప్ పై నిప్పులు చెరిగిన జో బైడెన్!

By:  Tupaki Desk   |   30 Sep 2020 8:10 AM GMT
నోరు మూసుకో .. ట్రంప్ పై నిప్పులు చెరిగిన జో బైడెన్!
X
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. రిపబ్లికన్ నేత, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. డెమొక్రటిక్ నేత జో బైడెన్ ట్రంప్‌కు గట్టి పోటీనే ఇస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ మధ్య ఏర్పాటైన తొలి డిబేట్.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత తలెత్తిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, పన్నుల విధానం వంటి అంశాలపై సాగింది. క్లీవ్‌ ల్యాండ్ ‌లో ఏర్పాటైన ఈ డిబేట్ ఇద్దరు నేతల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు అద్దం పడుతూ వాడివేడిగా సాగింది.

ఈ ఆర్థిక వ్యవస్థ కి సంబంధించిన డిబేట్ లో జో బిడెన్.. ఆగ్రహోదగ్రుడయ్యారు. డొనాల్డ్ ట్రంప్ చెల్లిస్తోన్న పన్నులను తప్పుపట్టారు. తాను అధికారంలోకి వస్తే ఆ తరహా పన్నుల విధానాన్ని రద్దు చేస్తాననీ హామీ ఇచ్చారు. ట్యాక్స్ కోడ్ విధానం వల్ల అతి తక్కువ పన్నును డొనాల్డ్ ట్రంప్ చెల్లిస్తున్నారని ఆరోపణలు చేసారు. ప్రభుత్వానికి నామమాత్రంగా వసూలు అవుతున్నాయని చెప్పారు. ట్యాక్స్ కోడ్ వ్యవస్థ వల్ల డొనాల్డ్ ట్రంప్ స్కూల్ టీచర్ల కంటే తక్కువ పన్నులను చెల్లిస్తున్నారని చెప్పారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అధ్వాన్నపు అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారని ఆరోపించారు. బిడెన్ చేసిన ఆరోపణలను ట్రంప్ తిప్పికొట్టారు. తాను మిలియన్ డాలర్ల కొద్దీ పన్నులను చెల్లించినట్లు తెలిపారు.

2015 నుంచి తాను చెల్లిస్తోన్న పన్నుల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని అన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఏడు బిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తామని జో బిడెన్ చెప్పారు. అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నా దగ్గర సరైన ప్రణాళిక ఉందని తెలిపారు. ఊహించినట్టే- జో బిడెన్ కుమారుడు హంటర్ ఆర్థిక కార్యకలాపాలు ఈ డిబేట్‌లో ప్రస్తావనకు వచ్చాయి. హంటర్..ఉక్రెయిన్, చైనా, రష్యాలతో అక్రమంగా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. రష్యా, చైనాల నుంచి పెద్ద ఎత్తున హంటర్‌కు నిధులు సమకూరాయని విమర్శించారు. ఈ అంశాన్ని మీడియా తొక్కి పెట్టిందని, అండర్ ప్లే చేస్తోందని మండిపడ్డారు. మూడున్నర మిలియన్ డాలర్ల మేర నిధులు హంటర్‌కు అక్రమంగా అందాయని, మాస్కో మాజీ మేయర్, దివంగత యూరీ భార్య నుంచి ఈ మొత్తం ఆయనకు ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పారు. దీనికి జో బిడెన్ బదులిస్తూ.. అలాంటివి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. మొత్తంగా తొలి డిబేట్ వాడివేడిగా సాగింది.