Begin typing your search above and press return to search.

తేడావస్తే తాటతీస్తాం..! చైనాపై అమెరికా వైఖరిని చెప్పేసిన బైడెన్​

By:  Tupaki Desk   |   29 Dec 2020 7:30 AM GMT
తేడావస్తే తాటతీస్తాం..! చైనాపై అమెరికా వైఖరిని చెప్పేసిన బైడెన్​
X
డొనాల్డ్​ ట్రంప్​ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో చైనాను.. ఆయన శత్రుదేశంగానే పరిగణించారు. చైనాపై వాణిజ్యపరంగా పలు ఆంక్షలు విధిస్తూ వచ్చారు. చైనాకు చెందిన పలు యాప్​లను కూడా నిషేధించారు. ఇరు దేశాల మధ్య చాలా గ్యాప్​ ఏర్పడింది. మరోవైపు చైనా.. భారత్​తోనూ కయ్యానికి కాలు దువ్వింది. ఓ వైపు పాకిస్థాన్​, నేపాల్​ను భారత్​పైకి ఎగదోసింది. అంతేకాక లడఖ్​ సరిహద్దుల్లో ఘర్షణకు తెరలేపింది. కొందరు భారత సైనికులు మరణించారు కూడా. ఈ సందర్భంలో అమెరికా భారత్​కు అండగా నిలబడింది.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో డొనల్డ్​ ట్రంప్​ ఓడిపోయారు. జో బైడెన్​ త్వరలోనే అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ క్రమంలో చైనాతో జోబైడెన్​ వెఖరి ఎలా ఉండబోతున్నదని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఆయన ట్రంప్​ లాగే చైనాతో కఠినంగా వ్యవహరిస్తారా? లేక రాజీ ధోరణిని అవలంభిస్తారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చైనాతో అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి. అనే విషయంపై జో బైడెన్ క్లారిటీ ఇచ్చేశారు.

‘చైనా చాలా దూకుడుగా వెళ్తున్నది. ఆ దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. చైనాకు చెక్​ పెట్టడానికి ప్రపంచదేశాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఓ కూటమి ఏర్పాటు చేసుకోవాలి. ఆ కూటమిలో చేరేందుకు అమెరికా సిద్ధంగా ఉంటుంది. అలాంటి దేశాలన్నీ మాతో కలిసి రావాలి’ అంటూ ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. జో బైడెన్​ వ్యాఖ్యలను బట్టి .. చైనాతో ఆయన ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారని స్పష్టం అవుతున్నది.

అంతేకాక జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాలపై ఆయన ఇటీవల సమావేశమయ్యారు. చైనా నుంచి అన్ని రంగాల్లో గట్టి పోటీ ఎదురవుతుందని ఆయనకు అధికారులు చెప్పారట. వాణిజ్యం, సాంకేతికపరిజ్ఞానం, మానవహక్కులు తదితర రంగాల్లో చైనా దూకుడుగా వెళ్తుందని.. నిబంధనలు పాటించడం లేదని వాళ్లు చెప్పారట. ఈ నేపథ్యంలో చైనా దూకుడుకు చెక్ పెట్టాలంటే ఆ దేశాన్ని నిలువరించాలంటే ప్రపంచదేశాలతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేయాలని బైడెన్​ భావిస్తున్నట్టు సమాచారం.