Begin typing your search above and press return to search.

బైడెన్ సంచలనం.. అమెరికా చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు

By:  Tupaki Desk   |   30 Nov 2020 5:30 AM GMT
బైడెన్ సంచలనం.. అమెరికా చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు
X
అంచనాలు ఏ మాత్రం లేని వారు కొన్నిసందర్భాల్లో అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ గా మారతారు. తాజాగా అలాంటి పరిస్థితే ఉందన్న అభిప్రాయం ఇప్పుడు అమెరికాలో వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఆసక్తికరంగానూ.. అందరి మనసుల్ని దోచుకునేలా ఉండటం గమనార్హం. అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించటానికి ముందే.. ఆయన తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు.

తాజాగా వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ టీంను ఆయన ప్రకటించారు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడు తీసుకోని ఆసక్తికర నిర్ణయాన్ని బైడెన్ తీసుకొని అమెరికన్ ప్రజల మనసుల్ని దోచేస్తున్నారు. ఇంతకూ ఆయన నిర్ణయంలోని ప్రత్యేకత ఏమంటే.. తన కమ్యునికేషన్స్ టీంలోని సభ్యులంతా మహిళలు కావటమే. ఇప్పటివరకు ఏ అధ్యక్షులు ఈ తరహా ఎంపిక చేయకపోవటం గమనార్హం. తాజా నిర్ణయంతో బైడెన్ చరిత్ర సృష్టించినట్లైంది. ఇప్పటికే పలు సీనియర్ పదవుల్ని చేపట్టిన 41 ఏళ్ల జెన్ సాకీని వైట్ హౌస్ సెక్రటరీగా ఎంపిక చేశారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో ఆమె వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా పని చేశారు.

తన నిర్ణయంపై జోబైడెన్ స్పందిస్తూ.. మొదటి సీనియర్ వైట్ హౌస్ కమ్యునికేషన్స్ టీంలో అందరూ మహిళలే ఉండటాన్ని తాను గర్వంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత.. అనుభవం ఉన్న ఈ కమ్యునికేటర్స్ తమ పని తీరులో వైవిధ్యాన్ని చూపిస్తారని.. దేశాన్ని తిరిగి ఉన్నత స్థితిలోకి నిలబెట్టేందుకు నిబద్ధతతో పని చేస్తారన్నారు. సాకీతో పాటు మరో ఆరుగురు మహిళల్ని ఈ టీం కోసం బైడెన్ ఎంపిక చేశారు.

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా అష్లీ ఇటిన్నేను.. కమలాకు సీనియర్ సలహాదారుగా.. స్పోక్స్ ఉమెన్ గా సైమన్ సాండర్స్ ను ఎంపిక చేశారు. వైట్ హౌస్ డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా పిలి టోబర్ ను.. ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కార్నే జీన్ పియర్రీని ఎంపిక చేశారు.బైడెన్ సతీమణి.. కాబోయే ఫస్ట్ ఉమెన్ జిల్ బైడెన్ కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా ఎలిజబెత్ అలెగ్జాండర్ ను ఎంపిక చేశారు. ఇలా.. అన్ని పోస్టులకు మహిళల్ని నియమించటం ద్వారా బైడెన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని చెప్పాలి. చూస్తుంటే.. బైడెన్ ప్రభుత్వంలో మహిళల ప్రాధాన్యత భారీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ట్రంప్ హయాంలో అధ్యక్షుల వారు మహిళల్ని తరచూ కించపరిచేలా మాట్లాడటం తెలిసిందే.