Begin typing your search above and press return to search.

హైటెక్ బాబు హయాంలో పోతున్న టెక్ జాబ్స్

By:  Tupaki Desk   |   10 Dec 2016 6:20 AM GMT
హైటెక్ బాబు హయాంలో పోతున్న టెక్ జాబ్స్
X
చంద్రబాబు తనను తాను హైటెక్ గా అభివర్ణించుకుంటారు. అసలు తెలుగు నేలకు టెక్నాలజీని పరిచయం చేసిందే తానంటారు. సత్యా నాదెళ్ల ఆ పొజిషన్లో ఉండడానికి కూడా తానే కారణమంటారు ఆయన. ఏ సందర్భం వచ్చినా పనిచేసినా చేయకపోయినా ఏదో ఒక టెక్నాలజీ ప్రస్తావన తెస్తారు. కరవు కాటకాల నివారణలోనూ... హుద్ హుద్ తుపాను సమయంలోనూ ఆయన హైటెక్ పద్దతులు పాటించానంటారు. అలాంటి టెక్ చంద్రబాబు హయాంలో టెక్నాలజీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉన్న "ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ " లో పనిచేస్తున్న 70 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలు కాపాడాలంటూ తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తుండడం చంద్రబాబు పాలనలో టెక్నాలజీ ఉద్యోగుల కష్టాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అంటే.. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రభుత్వానికి మ్యాప్ ల రూపంలో ప్రాజెక్టు నివేదికలు అందించడం అక్కడి ఉద్యోగుల విధి. 70 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెండు దశాబ్ధాలుగా హిమాయత్ నగర్లోని ఈ కార్యాలయంలో పని చేస్తున్నారు. వీరిని ఉన్నట్టుండి యాజమాన్యం తొలగించింది. డిసెంబరు 1వ తేదీ నుంచి కార్యాలయానికి తాళం వేసి విజయవాడకు వెళ్లి పోయింది. ఈ సంస్థకు కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఎఫ్ ఎస్ అధికారి సంజయ్ గుప్తా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి విషయం తెలియకుండా మేనేజ్ చేస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

రెండేళ్ల కిందట విశాఖలో హుద్ హుద్ తుఫాను సంభవిస్తే.. అక్కడ ఎంత నష్టం జరిగింది, ఎన్ని చెట్లు, ఎన్ని విద్యుత్ స్తంభాలు కూలి పోయాయనే వివరాలను.. క్షణాల్లో శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించిన ఘనత ఈ ఉద్యోగులది. అంతేకాదు నీరు-చెట్టు, పైబర్ గ్రిడ్, వాటర్ షెడ్ల నిర్మాణం.. ఇలా ఎన్నో ప్రాజెక్టుల్లో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు వాళ్లను తొలగించి ఉత్తర భారతదేశానికి చెందిన వారిని ఇందులో నియమించు కోవాలనే ఉద్దేశంతోనే సంజయ్ గుప్తా తమను తొలగించారని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా దీనిపై దృష్టిపెడితేనే వారి జాబులు నిలుస్తాయి.