Begin typing your search above and press return to search.

ఆత్మాహుతి దాడి: అమరులైన ముగ్గురు జవాన్లు.. ఇద్దరు ముష్కరులు హతం

By:  Tupaki Desk   |   11 Aug 2022 8:50 AM GMT
ఆత్మాహుతి దాడి: అమరులైన ముగ్గురు జవాన్లు.. ఇద్దరు ముష్కరులు హతం
X
అనుమానాలే నిజమయ్యాయి. స్వాతంత్ర్య సంబరాల వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో దేశంలోని కీలకమైన స్థానాల్లో భారీ ఉగ్రదాడులకు ప్లానింగ్ జరుగుతుందంటూ నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా అలాంటి కుట్ర ఒకటి బయటకు వచ్చింది. ఆర్మీ క్యాంప్ మీదకు ముష్కరులు దాడికి యత్నం చేయగా.. వారికి ధీటుగా సమాధానం ఇచ్చిన క్రమంలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఈ విషాద ఘటన తాజాగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలోచోటు చేసుకుంది. ఉగ్రవాదులు పన్నిన ఆత్మాహుతి దాడిని సమర్థంగా తిప్పి కొట్టినప్పటికీ.. అందులో భాగంగా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన వైనం షాకింగ్ గా మారింది.

గురువారం తెల్లవారుజామున రాజౌరీ జిల్లా పార్గల్ లోని ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ ను దాటి లోపలకు వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. క్యాంప్ లో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారు. అయితే.. ఈ కుట్రను గుర్తించిన ఆర్మీ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు.

దీంతో అలెర్టు అయిన భద్రతా సిబ్బంది కూడా కాల్పులు చేపట్టారు. అయితే.. వారిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి.. వైద్యం చేయిస్తున్నారు.

ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. గడిచిన ఆరు నెలలుగా రాజౌరీ ప్రాంతంలో వరుస ఉగ్రదాడులు జరుగుతున్నాయి. తాజాగా దాడి వెనుక లష్కరే తోయిబా ముఠా ఉందన్న మాట వినిపిస్తోంది. బుధవారం పుల్వామా జిల్లాలో రోడ్డు పక్కన 25 కేజీల పేలుడు పదార్థాల్ని గుర్తించారు.

దీంతో మరో ఉగ్రదాడి కుట్ర భగ్నమైంది. ఈ పంద్రాగస్టుకు దేశంలో పలుచోట్ల ఉగ్రదాడికి ప్లానింగ్ చేస్తున్నారు. నిఘా వర్గాలు ఇలాంటి ప్రయత్నాల్ని నిర్వీర్యం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు బుధవారం బడ్ గామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.