Begin typing your search above and press return to search.

వీర విన‌య విదేయ జితేంద‌ర్ జంప్‌!

By:  Tupaki Desk   |   26 March 2019 11:18 AM GMT
వీర విన‌య విదేయ జితేంద‌ర్ జంప్‌!
X
అవ‌మానిస్తే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు. అనుమానిస్తే.. ఇంత అవ‌మానిస్తారా? అంటూ మండిప‌డ‌తారు. సిట్టింగ్ఎంపీగా ఉండి కూడా టికెట్ ఇవ్వ‌కుంటే.. ఎంత‌గా ర‌గిలిపోవాలి. మ‌రెంత‌గా మండిప‌డాలి. కానీ.. ఇవేమీ లేకుండా కూల్ గా.. నాకు ఎంపీ టికెట్ ఇవ్వ‌లేదంటే.. మా బాస్ నాకు మ‌రింత పెద్ద ప‌ద‌వి ఇవ్వాల‌న్నా ఆలోచ‌న‌లో ఉండి ఉండొచ్చు. ఆయ‌నేం చేసినా నా మంచి కోస‌మే.. చ‌క్క‌టి ఫ్యూచ‌ర్ కోస‌మే చేస్తారంటూ చిల‌క ప‌లుకులు ప‌ల‌క‌ట‌మే కాదు.. అప‌ర వీర విన‌య విదేయుడ‌న్న బిరుదును సొంతం చేసుకున్నారు టీఆర్ ఎస్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి.

టికెట్ ఇవ్వ‌కుండా అధినేత తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన‌ట్లుగా చేసి అంద‌రికి విస్మ‌యాన్ని క‌లిగించిన ఆయ‌న‌.. తాజాగా తాను విప‌రీతంగా అభిమానించే కేసీఆర్ కు భారీ షాకిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.ఎంపీగా.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తూ టికెట్ ఇవ్వ‌కుండా మొండిచేయి చూపించిన అధినేత‌పై నిప్పులు చెరిగిన వివేక్ ఎపిసోడ్ ను మ‌ర్చిపోక ముందే జితేంద‌ర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిన్న‌టి వ‌ర‌కూ పార్టీ మార‌నంటే మార‌నంటూ విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న తాజాగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ తో భేటీ అయిన ఆయ‌న‌.. తాను పార్టీ మార‌టానికి రంగం సిద్ధం చేసుకున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. త‌న‌కు అధినేత టికెట్ ఇవ్వ‌కున్నా పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తాన‌ని చెప్పిన జితేంద‌ర్ ప్ర‌ధాని మోడీ స‌మ‌క్షంలో పార్టీలో చేర‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్య‌ర్థిగా డీకే అరుణ పోటీ చేస్తున్నారు. దీంతో.. ఆమెను గెలిపించేందుకు బీజేపీ శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో టికెట్ రాక ర‌గిలిపోతున్న జితేంద‌ర్ ను బుజ్జ‌గించి.. డీకే అరుణ గెలుపులో కీల‌క‌భూమిక పోషిస్తే మంచి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. డీకే అరుణ విజ‌యానికి కృషి చేస్తే.. రాజ్య‌స‌భ సీటు క‌న్ఫ‌ర్మ్ చేసేందుకు హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 29న తెలంగాణ రాష్ట్రానికి రానున్న ప్ర‌ధాని మోడీ స‌మ‌క్షంలో జితేంద‌ర్ కాషాయ కండువాను క‌ప్పుకుంటార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. త‌న మ‌హూబూబ్ న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జితేంద‌ర్ ఇంటికి మోడీ స్వ‌యంగా వెళ‌తార‌ని.. ఆ విధంగా ఆయ‌న గౌర‌వాన్ని మ‌రింత పెంచే ఉద్దేశంతో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు. జితేంద‌ర్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆయ‌న బీజేపీలో ప‌లు ప‌ద‌వులు చేప‌ట్టారు. 1999 నుంచి 2004 వ‌ర‌కు బీజేపీ ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. త‌ర్వాత టీడీపీలో చేరారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లోచేరిన ఆయ‌న 2014లో టీఆర్ఎస్ ఎంపీగా విజ‌యం సాధించారు. తాజాగా ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించ‌టంతో ఊహించ‌ని రీతిలో కేసీఆర్ కు షాకిస్తూ.. పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నారు.