Begin typing your search above and press return to search.

లోక్ సభలో అడ్డంగా దొరికిపోయిన జితేందర్

By:  Tupaki Desk   |   25 Feb 2016 4:36 AM GMT
లోక్ సభలో అడ్డంగా దొరికిపోయిన జితేందర్
X
తమదైన వాదనతో ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని టీఆర్ఎస్ నేతలు తొలిసారి అడ్డంగా దొరికిపోయారు. అది కూడా.. లోక్ సభలో. ఈ ఆసక్తికర సన్నివేశానికి సాక్ష్యంగా బుధవారం నిలించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. జేఎన్ యూ వర్సిటీల్లో చోటు చేసుకున్న ఉదంతాలపై జరిగిన చర్చ సందర్భంగా రోహిత్ ఇష్యూ మీద మాట్లాడిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో రోహిత్ విషయం మీద ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించానని.. కానీ.. కేసీఆర్ మాట్లాడలేదని సభలో చెప్పారు. ‘‘నేను కాల్ చేశారు. కానీ.. సార్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడలేరన్న బదులు వచ్చింది. ఆయన మళ్లీ ఫోన్ చేస్తారన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా ఈ విషయం బయటకు చెప్పలేదు. ఇప్పటికీ ఆయన నుంచి ఫోన్ రాలేదు’’ అని స్మృతి వ్యాఖ్యానించారు.

ఈ విషయం మీద టీఆర్ ఎస్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి వెంటనే స్పందించారు. కేసీఆర్ కు మంత్రి స్మృతి ఇరానీ ఫోన్ చేసినప్పుడు తాను అక్కడే ఉన్నానని చెప్పిన ఆయన.. ‘‘దీనిపై వెంటనే కేసీఆర్ ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డితో మాట్లాడారు. పరిస్థితి సమీక్షించారు. 15నిమిషాల తర్వాత శివధర్ రెడ్డి తిరిగి ఫోన్ చేశారు. అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారని.. పరిస్థితిని అదుపులోకి తేవాలంటే కేంద్రమంత్రి దత్తాత్రేయను అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని ప్రధానికి కేసీఆర్ వివరించారు’’ అని చెప్పిన ఆయన.. అక్కడి వారిని నియంత్రించేందుకు దత్తాత్రేయను అరెస్టు చేయాలని తాము ఆదేశించినట్లుగా పేర్కొన్న జితేందర్ రెడ్డిపై స్మృతి అప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేశారు.

జితేందర్ రెడ్డి ప్రకటన చాలా విచిత్రంగా ఉందని.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను అరెస్ట్ చేయాలట. అది కూడా.. తప్పు చేసినందుకు కాదు.. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకన్న జితేందర్ రెడ్డి మాటల్లోని డొల్లతనాన్ని వేలెత్తి చూపిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి ఫోన్ చేస్తే మాట్లాడేందుకు నిమిషం సమయం లేని కేసీఆర్.. పోలీసు అధికారులతో మాత్రం పలుమార్లు మాట్లాడటం దేనికి నిదర్శనం. ఒక కేంద్రమంత్రిని అరెస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? అన్నప్రశ్నలు జితేందర్ రెడ్డి వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చాయి. తమ అధినేతను రక్షించాలన్న ఆత్రుతతో జితేందర్ రెడ్డి అడ్డంగా దొరికిపోవటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమేజ్ ను లోక్ సభలో డ్యామేజ్ చేసేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.