Begin typing your search above and press return to search.

వైసీపీ - టీడీపీల‌కు టీఆర్ ఎస్ ఝ‌ల‌క్!

By:  Tupaki Desk   |   17 March 2018 4:51 PM GMT
వైసీపీ - టీడీపీల‌కు టీఆర్ ఎస్ ఝ‌ల‌క్!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా - విభ‌జ‌న హామీల అమ‌లు పై కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా మోదీ సర్కారుపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప‌లు జాతీయ పార్టాలు బేష‌ర‌తుగా మద్దతిస్తామని ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో...కొద్ది రోజుల క్రితం బీజేపీ స‌ర్కార్ పై, మోదీపై నిప్పులు చెరిగిన‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్ ఎస్ కూడా ఆ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తిస్తుంద‌ని అంతా భావించారు. అందులోనూ, ఏపీకి ప్ర‌త్యేకహోదా ఇవ్వాల్సిందేన‌ని కొంద‌రు టీఆర్ ఎస్ నేత‌లు ఇప్ప‌టికే త‌మ అభిప్రాయాల‌ను వెలిబుచ్చారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన వైసీపీ - టీడీపీ ల‌కు టీఆర్ ఎస్ షాకిచ్చింది. లోక్ స‌భ‌లో వైసీపీ - టీడీపీలు ప్ర‌వేశ‌పెట్ట‌బోతోన్న అవిశ్వాస తీర్మానంతో టీఆర్ ఎస్ కు ఎటువంటి సంబంధం లేద‌ని టీఆర్ ఎస్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి....లోక్ స‌భ‌లో తేల్చి చెప్పేశారు.

అవిశ్వాస తీర్మానం విష‌యంలో త‌మ పార్టీ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తున్నామ‌ని జితేంద‌ర్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టం 2014 లో పొందుప‌రిచిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని మాత్ర‌మే టీఆర్ ఎస్ పోరాడుతుందని స్ప‌ష్టం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌తో కేంద్ర‌ప్ర‌భుత్వం ఆట‌లాడుతోంద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌కు కేంద్రం ప్ర‌త్యేకంగా ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌ని అన్నారు. కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్.....జాతీయ రాజ‌కీయాల్లో పెనుమార్పుటు తీసుకురాబోతోందిన జోస్యం చెప్పారు. క‌ర్ణాట‌కలో ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత జాతీయ రాజ‌కీయ ముఖ‌చిత్రం మార‌బోతోంద‌న్నారు. అయితే, పొరుగు తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్....టీడీపీ - వైసీపీల అవిశ్వాస తీర్మానానికి త‌ప్ప‌క మ‌ద్ద‌తిస్తుంద‌నుకున్న వారికి ఈ నిర్ణ‌యం తీవ్ర విస్మ‌యం క‌లిగిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.