Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్‌ కు బ్రేకులేస్తున్న ఒకేఒక్కడు!

By:  Tupaki Desk   |   13 Sep 2015 5:53 AM GMT
మోడీ బ్యాచ్‌ కు బ్రేకులేస్తున్న ఒకేఒక్కడు!
X
ఒకే ఒక్కడు మోడీ బ్యాచ్‌ కు బ్రేకులు వేస్తున్నాడు. తమ నిర్ణయాలను ప్రకటించలేకుండా.. ఆగి వేచిచూసేలా చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ బతిమాలేలా చేసుకుంటున్నాడు. ఇంతకూ ఆ ఒకే ఒక్కడు ఎవరో తెలుసా..? బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రాంమాంఝీ. గతంలో నితీశ్‌ కుమార్‌ నుంచి ముఖ్యమంత్రి పదవిని అందుకుని, తిరిగి ఆ పదవిని ఆయనకు ఇవ్వడానికి మొండికేసి.. అత్యంత అవమాన కరమైన రీతిలో మాజీ సీఎంగా మారిన జితన్‌ రాం మాంఝీ ఇప్పుడు ఒక సొంత పార్టీ పెట్టుకుని బీహార్‌ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఎన్డీయే కూటమి సీట్ల పంపకాలు లెక్కతేలకుండా.. అన్ని పార్టీలు ఇక ప్రచారం పర్వంలో దూసుకువెళ్లడానికి చాన్సులేకుండా మోడీ బ్యాచ్‌ స్పీడుకు మాంఝీ బ్రేకులువేస్తున్నాడు.

బీహార్‌ లో మొత్తం 243 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో భాజపాతో పాటూ రాంవిలాస్‌ పాశ్వాన్‌ కు చెందిన ఎల్‌ జేపీ, ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన మరో పార్టీ ఆర్‌ ఎస్‌ ఎల్‌ పీ - మాంఝీకి చెందిన హెచ్‌ ఏఎం ఉన్నాయి. కూటమి విజయం సాధిస్తే భాజపా తాను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది గనుక.. వారు 160 సీట్లను తమ పార్టీకోసం ఉంచుకున్నారు. ఇకపోతే.. పాశ్వాన్‌ పార్టీ కూడా పెద్దదే గనుక.. 40 సీట్లు కేటాయించారు. కుశ్వాహా పార్టీకి 25 సీట్లు ఇచ్చారు. మాంఝీకి 15 కేటాయిస్తే ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే.. గతంలో సీఎంగా పనిచేశాడు అనే పేరు తప్ప మాంఝీ ఎన్నికలను ప్రభావితం చేసేంత బలమైన నాయకుడు ఎంత మాత్రమూ కాదు. ఒక కులానికి చెందిన ప్రతినిధి మాత్రమే! ఆయనకు వ్యక్తిగతంగా కులబలం కూడా పెద్దగా లేదు. నితీశ్‌ కు సీఎం కుర్చీ ఇవ్వకుండా కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి దారుణంగా దెబ్బతిన్న మాంఝీ.. తనకు ఎక్కువ సీట్లు కావాలని పట్టుపడుతున్నాడు. ఒకవైపు పాశ్వాన్‌ - కుశ్వాహా లాంటి వాళ్లు.. సీట్ల పంపకం విషయంలో అమిత్‌ షా ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అంటూ. ఫుల్‌ పవర్స్‌ ఆయనకు ఇచ్చేసి మిన్నకుండిపోగా.. మాంఝీ మాత్రం..అడ్డుపడుతూ ఉండడం గమనార్హం. అందుకే ఇప్పటిదాకా ఆ పార్టీ పంపకాలు లెక్క తేలలేదు. ముందు పార్టీల లెక్క తేలితే.. సీట్లు పంచుకుని ఆ తర్వాత ప్రచారం ముమ్మరం చేయవచ్చునని అనుకుంటున్నారు.