Begin typing your search above and press return to search.

పేలిన జియోఫోన్‌...అంతా ట్రాష్ అంటూ క్లారిటీ

By:  Tupaki Desk   |   23 Oct 2017 5:47 PM GMT
పేలిన జియోఫోన్‌...అంతా ట్రాష్ అంటూ క్లారిటీ
X
జీరో ఎఫెక్టివ్ ప్రైస్ అంటూ 1500 డిపాజిట్‌తో జియో ఫీచర్ ఫోన్లను కస్టమర్లకు అందిస్తున్న రిలయన్స్ సంస్థ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. సంచలనం సృష్టించిన రిలయెన్స్ జియో ఫీచర్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా పేలినట్లు వచ్చిన వార్త‌లు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లాంటి ఫీచర్లతో ఇప్పటికే జియో ఫోన్‌కు పాజిటివ్ రివ్యూలు వస్తుండ‌గా...జియో ఫోన్ చార్జింగ్ పెడుతుండ‌గా పేలింద‌నే విషయాన్ని ఓ ట్విట్టర్ యూజర్ తన అకౌంట్ ద్వారా వెల్లడించాడు. అయితే ఈ ఉదంతం అనుమానాస్ప‌దంగా ఉంద‌ని రిల‌య‌న్స్ స్పందించింది.

నెల రోజులుగా తమ 60 లక్షల మంది కస్టమర్లకు జియో ఫోన్లను రిలయెన్స్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలా ఫోన్ పొందిన ఓ క‌స్ట‌మ‌ర్ త‌న బ్యాటరీ పేలింద‌ని వెల్ల‌డించారు. కశ్మీర్‌లో ఈ ఘటన జరిగినట్లు టెక్ బ్లాగ్ ఫోన్ రాడార్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ ఫోన్ పేలుడుకు సంబంధించి ఫొటోను ట్వీట్ చేసిన సదరు నెటిజన్.. తర్వాత దానిని డిలిట్ చేశాడు. ఈ పేలుడులో ఫోన్ వెనుక భాగం పూర్తిగా పాడైపోగా.. ముందు భాగం మాత్రం చెక్కు చెదరనట్లు ఫొటోలు స్పష్టంగా కనిస్తోంది. అయితే ఈ పేలుడు తర్వాత కూడా బ్యాటరీ పనిచేస్తున్నట్లు ఈ ఫోన్‌ను చెక్ చేసిన లైఫ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.

మరోవైపు ఈ ఘటనపై రిలయెన్స్ వెంటనే స్పందించి ఆ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ``జియో ఫోన్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తయారు చేయించాం. ప్రతి ఫోన్‌ను క్వాలిటీ టెస్ట్ చేయించాం. పేలుడు ఘటన గురించి మాకు తెలిసింది. అయితే అది కావాలనే చేసినట్లు మా విచారణలో తేలింది. జియో బ్రాండ్‌ను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ పని చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం`` అని ఆ ప్రతినిధి స్పష్టంచేశారు. జియోఫోన్ల‌కు సంబంధించి బ్యాటరీ పేలుడు ఘటన ఇదే తొలిసారి.