Begin typing your search above and press return to search.

ఖైదీ హత్య కేసులో 15 మందికి మరణశిక్ష.. కోర్టు సంచలనం

By:  Tupaki Desk   |   19 Aug 2022 3:12 PM IST
ఖైదీ హత్య కేసులో 15 మందికి మరణశిక్ష.. కోర్టు సంచలనం
X
ఒక ఖైదీని హత్య చేసిన నేరానికి 15 మందికి ఉరి శిక్ష పడింది. మరో ఏడుగురు దోషులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. దుమారం రేపిన ఈ కేసులో జార్ఖండ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అసలేంటి కేసు.. దాని పూర్వపరాలేంటో తెలుసుకుందాం.

జార్ఖండ్ లోని ఘాఘీడీహ్ సెంట్రల్ జైలులో 2019లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా.. మనోజ్ కుమార్ సింగ్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు.

ఈ కేసులో కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.  హత్య, నేరపూరిత కుట్ర కింద ఏకంగా 15 మందికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించడం సంచలనమైంది.  మరో ఏడుగురికి ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్షను విధించారు.

మరణశిక్ష పడిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు ఖైదీలను పట్టుకొని తమ ఎదుట హాజరుపరుచాలని కోర్టు డీజీపీని ఆదేశించింది. ఆ దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

కసబ్ లాంటి ఉగ్రవాదులకు, నిర్భయ లాంటి దారుణ హత్యాచారాల విషయంలో ఉరిశిక్షలను అమలు చేశారు.

ఇక ఇటీవల గోద్రా అల్లర్ల కేసులోనూ యావజ్జీవ పడ్డ ఖైదీలను విడుదల చేశారు. ఇక ఒక హత్యకేసులో ఏకంగా 15 మందికి ఉరిశిక్ష వేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసు ఇప్పుడు చర్చకు దారితీసింది.