Begin typing your search above and press return to search.

8 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి సీటుబెల్ట్ పెట్టుకోలేదట..!

By:  Tupaki Desk   |   15 Sept 2019 10:42 AM IST
8 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి సీటుబెల్ట్ పెట్టుకోలేదట..!
X
కొత్త వాహన చట్టం పుణ్యమా అని చలానాలు ఒక రేంజ్లో పేలుతున్నాయి. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్ని నడపటం ముమ్మాటికే తప్పే. కాకుంటే.. తప్పు చేస్తున్నారన్న పేరు చెప్పి భారీ ఎత్తున చలానాలు విధిస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. అదే సమయంలో.. అధికారులు చేస్తున్న తప్పుల కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకున పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

ఈ రాష్ట్రానికి చెందిన ఝులావర్ జిల్లాకు చెందిన రాజేంద్ర అనే పెద్ద మనిషి 2011 సెప్టెంబరులో మరణించారు. ఆయన మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత తాజాగా అధికారుల నుంచి ఒక నోటీసు వచ్చింది. సదరు నోటీస్ సారాంశం ఏమంటే.. సెప్టెంబరు 11న రాజేందర్ ఓవర్ స్పీడ్ తో కారును నడిపారని.. ఆయన సీటు బెల్ట్ పెట్టుకోలేదని... ఈ తప్పుల నేపథ్యంలో ఆయనకు నోటీసులు పంపారు. అందులో రాజేంద్ర డ్రైవింగ్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పేర్కొన్నారు.

ఈ నోటీసు చూసిన రాజేంద్ర ఫ్యామిలీ అవాక్కైంది. ఎనిమిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తి వాహనం నడపటం ఏమిటి? అది కూడా అతి వేగంగా.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో కొసమెరుపు ఏమంటే.. రాజేంద్ర కుటుంబంలో ఎవరికి కారు లేకపోవటం. వారికి ఒక్క టూవీలర్ మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. తప్పు చేసిన వాహనదారులకు భారీ జరిమానాలు విధిస్తున్న అధికారులు.. మరి వారే ఇంత ఘోరమైన తప్పు చేసినందుకు ఏం చేయాలి? ఎంత జరిమానా విధించాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు.