Begin typing your search above and press return to search.

దివాళ దిశ‌గా...భార‌త‌దేశ అతిపెద్ద ఎయిర్‌ లైన్స్‌

By:  Tupaki Desk   |   6 Jan 2019 2:30 PM GMT
దివాళ దిశ‌గా...భార‌త‌దేశ అతిపెద్ద ఎయిర్‌ లైన్స్‌
X
భార‌త‌దేశ విమానయాన రంగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన జెట్ ఎయిర్‌ వేస్ ఇక కనుమరుగు కాబోతున్నాదా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఇప్పటికే పైలెట్లకు, సిబ్బందికి సరైన సమయంలో జీతాలు చెల్లించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థ.... మరోసారి ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో విఫలమైంది. ఇప్పటికే సీనియర్ మేనేజ్‌ మెంట్ ఉన్నతాధికారులు, పైలెట్లు, ఇంజినీర్లకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్న సంస్థ.. డిసెంబర్ నెలకుగాను ఇతర సిబ్బందికీ ఇంకా ఇవ్వలేదు. ఈ మేరకు పీటీఐకి సంబంధిత వర్గాలు తెలిపాయి.

నష్టాల బారిన పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న జెట్ ఎయిర్‌ వేస్ పైలట్లను జీతాలు తగ్గించుకోవాల్సిందిగా కొన్నాళ్ల నుంచి కోరుతోంది. అయితే దానికి పైలట్లు అంగీకరించకపోవడంతో ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నట్లు స‌మాచారం. సుమారు 500 మంది గ్రౌండ్ స్టాఫ్‌ ను తొలగించాలని సంస్థ భావిస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగుల తొలగింపుతో పాటు బోయింగ్, ఎయిర్‌ బస్‌లలోని క్యాబిన్ క్రూని కూడా క్రమబద్ధీకరణ చేయాలని జెట్ ఎయిర్‌ వేస్ చూస్తోంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌ లైన్స్‌ లో మొత్తం 16558 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో 5 వేల మంది గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ల జీతాలు సగటున నెలకు పది నుంచి 40 వేల మధ్యలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 1040 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి. ఈ నష్టాల నుంచి బయటపడటానికి ఖర్చులు తగ్గించాలనుకున్న జెట్ ఎయిర్‌ వేస్ తమ జీతాలను 25 శాతం వరకు తగ్గించుకోవాలని పైలట్లను కోరినా వాళ్లు అంగీకరించలేదు. దీంతో గ్రౌండ్ స్టాఫ్‌ ను తొలగించే ఆలోచన చేస్తోంది.

నరేష్ గోయల్ ఆధ్వర్యంలో నడుస్తున్న జెట్ ఎయిర్‌ వేస్ సంస్థ ప్రస్తుతం దోహా, మస్కట్, అబుదాబి, దుబాయిలకు దేశీయంగా పలు నగరాల నుంచి వారానికి 39 చొప్పున సర్వీసులను నడుపుతోంది. జెట్ ఎయిర్‌ వేస్‌ కు కీలక మార్కెటైన గల్ఫ్ దేశాల్లో డిమాండ్ పడిపోతుండటం, సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడికి నడిపే సర్వీసుల వల్ల ఎలాంటి లాభం వచ్చే అవకాశాలు లేకపోవడంతో అక్క‌డికి స‌ర్వీసులు న‌డ‌ప‌కూడ‌ద‌ని ఇటీవ‌ల‌ నిర్ణయం తీసుకుంటున్నారు. అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌ వేస్‌ కు జెట్ ఎయిర్‌ వేస్‌ లో 24 శాతం వాటా ఉన్నప్పటికీ అదే రూట్లలో విమానాలను నిలిపివేయనుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. వీటిలో కొచి, కోజికూడ్, తిరువనంతపురంల నుంచి దోహాలకు, లక్నో, మంగళూరుల నుంచి అబుదాబి రూట్లకు నడుపనున్న విమాన సర్వీసులను నిలిపివేయనున్న సంస్థ..మంగళూరు-దుబాయిల మధ్య నూతన సర్వీసును ప్రారంభించే అవకాశాలు లేవని ఆ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 5 నుంచి ఈ సర్వీసులన్ని నిలిచిపోనున్నాయి. వీటితోపాటు ఢిల్లీ-మస్కట్‌ ల మధ్య నడిచే విమాన సర్వీసును కూడా ఈ నెల నుంచి విరమించుకోనున్నది. ప్రస్తుతం కొచి-దోహా, మంగళూరు-అబుదాబి, మంగళూరు-దుబాయి, లక్నో-అబుదాబిల మధ్య రోజుకు విమాన సర్వీసులను నడుపుతున్న సంస్థ.. కోజికూడ్-దోహా, ఢిల్లీ-మస్కట్‌ ల మధ్య వారానికి నాలుగు రోజులపాటు, తిరువనంతపురం-దోహాల మధ్య వారానికి మూడుసార్ల చొప్పున సర్వీసులను అందిస్తున్నది. అయినప్పటికీ గల్ఫ్ కార్యకలాపాలపై సంస్థ గట్టి నమ్మకంతో ఉన్నది. ఈ ఏడు రూట్ల విమాన సర్వీసులకు స్వస్తి పలుకనున్న సంస్థ..ముంబై-దోహా, ఢిల్లీ-దోహా, ముంబై-దుబాయి రూట్లలో మరిన్ని నూతన సర్వీసులు అందించే అవకాశం ఉన్నదని తెలిపింది. నష్టాల్లో నడుస్తున్న రూట్లకు స్వస్తి పలికి లాభాల్లో నడుస్తున్న రూట్ల పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.1,261 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది.