Begin typing your search above and press return to search.

కేఏ పాల్‌ ను క్రైస్త‌వులు కోరుతున్న‌ది ఇదేన‌ట‌

By:  Tupaki Desk   |   27 Jan 2019 1:12 PM GMT
కేఏ పాల్‌ ను క్రైస్త‌వులు కోరుతున్న‌ది ఇదేన‌ట‌
X
కేఏ పాల్‌...ఈ పేరు తెలుగు రాష్ర్టాల్లో ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థపకుడి హోదా ఇటీవలి కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన ఆయన.. ఏపీ సీఎం చంద్రబాబు - ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్‌ ల‌పై స్పందిస్తూ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని పదే పదే విమర్శిస్తున్నారు. దీంతో పాటుగా - తనకు ఇద్దరు వ్యక్తులతో ప్రాణహాని ఉందని.. ఒకరు అధికార పార్టీ చంద్రబాబు అయితే.. రెండోది ప్రతిపక్ష నేత జగన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరువురి అవినీతిపై బహిరంగం మాట్లాడుతున్నందుకే తనను హతమార్చాలని చూస్తున్నారని కేఏ పాల్‌ పేర్కొన్నారు. ఒక మతానికి చెందిన గురువుగా.. ప్రపంచ దూతగా ఉన్న తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

అయితే, ఇలా పాల్ సంచ‌ల‌న కామెంట్లు చేయ‌డంపై తాజాగా క్రైస్త‌వ స‌మాజం త‌ర‌ఫున స్పంద‌న వ‌చ్చింది. క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా క‌న్వీనర్ జెరూసలేం మత్తయ్య స్పందించారు. కేఏ పాల్‌ రాజకీయ రంగంలో గానీ - క్రైస్తవ మత ప్రభోదకుడిగా గానీ మాత్రమే ఉండాలని తెలియ చేశారు. నిత్యం వార్తల్లో ఉండాలని రాజకీయ విమర్శలు చేస్తూ క్రైస్తవుల పరువు తీయవద్దని క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా హితవు పలికింది. క్రైస్తవ మతగురువుగా ఉన్నప్పుడు ప్రధానమంత్రులు - ముఖ్యమంత్రులు - సినీ - వ్యాపార ప్రముఖులు వచ్చి నమస్కరించారంటే కేవలం దేవుడు ఇచ్చిన శక్తి వల్ల మాత్రమేనని, వాటిని చులకనగా మాట్లాడవద్దని తెలియచేశారు. రాజకీయాలకు సంబంధించి జాతీయ - అంతర్జాతీయ వేదికల్లో క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొనవద్దని స్ప‌ష్టం చేశారు. క్రైస్తవుల ఓట్లను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాలనే ఆలోచనను విడనాడాలని డిమాండ్ చేయ‌డ‌మే కాకుండా...ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తాము తీవ్రంగా అడ్డుకుంటామని.., క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరిస్తామని హెచ్చ‌రించారు. ఇలాంటి హెచ్చ‌రిక‌ల నేప‌థ్ంయ‌లో అయినా...పాల్ క‌ల‌క‌లం రేపే కామెంట్లు ఆపుతారా అనేది ఆలోచించాల్సిందే.