Begin typing your search above and press return to search.

అపర కుబేరుడికి కొన్ని గంటల్లో వాటిల్లిన నష్టమెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   30 April 2022 10:30 AM GMT
అపర కుబేరుడికి కొన్ని గంటల్లో వాటిల్లిన నష్టమెంతో తెలుసా?
X
జెఫ్ బెజోస్.. ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు. కార్ల షెడ్ లో అమెజాన్ ను ప్రారంభించి.. డోర్ డెలివరీతో అందరికీ చేరువయ్యారు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.20 లక్షల కోట్లపైనే. ఆయన ఇక్కడ వరకు రావడం కేవలం ఒకే ఒక్క ఐడియా అమెజాన్ తో సాధ్యమైంది. ఇక కొవిడ్ కాలంలో ఆన్ లైన్ డెలివరీలకు పెరిగిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. సరిగ్గా రెండేళ్ల కిందట వ్యాపించిన కొవిడ్ తో అన్ని ఆఫ్ లైన్ వ్యాపారాలు మూతపడ్డాయి. ఆన్ లైన్ వ్యాపారం భారీగా పుంజుకుంది. దీంతో అమెజాన్‌ కార్యకలాపాల్ని విస్తరించింది. కొత్త గిడ్డంగులను, స్టోర్లను నిర్మించింది. భారీ వేతనాలతో ఉద్యోగులను ఆకర్షించింది. ప్రస్తుతం సాధారణ కార్యకలాపాలు పుంజుకుంటుండడంతో ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ తగ్గించారు.

దీంతో అమెజాన్‌ వ్యాపారం నెమ్మదించింది. పైగా అధిక వేతనాలు, గిడ్డంగుల నిర్వహణ భారీ వ్యయంతో కూడిన వ్యవహారంగా మారింది. మరోవైపు ఇంధన ధరలు పెరగడంతో రవాణా వ్యయం సైతం భారంగా పరిణమించింది. అలాగే ద్రవ్యోల్బణం పెరగడంతో ఖర్చులు రెండు బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. ఇక మార్చితో ముగిసిన క్వార్టర్లీ ఫలితాలను అమెజాన్‌ గురువారం ప్రకటించింది. 3.84 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది.

క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.1 బిలియన్‌ డాలర్ల లాభాల్ని నివేదించింది. రివియాన్‌ మోటివ్‌ స్టాక్స్‌లో అమెజాన్‌ పెట్టుబడి 7.6 బిలియన్‌ డాలర్ల నష్టాలకు కారణమైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఈ-కామర్స్‌ వ్యాపారంలో 1.28 బిలియన్‌ డాలర్ల ఆపరేటింగ్‌ నష్టాల్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నికరంగా మార్చి త్రైమాసికంలో అమెజాన్‌ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

కోల్పోయింది రూ.1.56 లక్షల కోట్లు బెజోస్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలో 20.5 బిలియన్‌ డాలర్లు (రూ.1.56 లక్షల కోట్లు) కరిగిపోయింది. శుక్రవారం కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవిచూడడమే ఇందుకు కారణం. అమెజాన్‌ షేరు నిన్న 14.05 శాతం పడిపోయి 2,485.63 డాలర్ల వద్ద స్థిరపడింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్‌ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. 2015 తర్వాత కంపెనీ తొలిసారినష్టాల్ని నమోదు చేసింది. అలాగే 21 ఏళ్ల తర్వాత తొలిసారి విక్రయాల వృద్ధి నెమ్మదించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు శుక్రవారం భారీ పతనాన్ని చవిచూశాయి.

2022లో 43 బి.డాలర్లు ఆవిరి..జెఫ్‌ బెజోస్‌కు అమెజాన్‌లో 11.1 శాతం వాటాలున్నాయి. ఆయన వ్యక్తిగత సంపదలో అధిక వాటా అమెజాన్ షేర్లదే. అమెరికాలో నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం బెజోస్‌ సంపద 148 బిలియన్‌ డాలర్లు గా ఉంది. మొత్తంగా ఆయన శుక్రవారం ఒక్కరోజే తన సందపలో 12 శాతం పతనాన్ని చవిచూశారు. నిన్నటి నష్టాలతో కలుపుకొని 2022లో ఇప్పటి వరకు బెజోస్‌ సంపద 43 బిలియన్‌ డాలర్ల మేర తరిగిపోయింది.

అయినప్పటికీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 249 బిలియన్‌ డాలర్లతో ఎలాన్‌ మస్క్‌ తొలిస్థానంలో ఉన్నారు. బెజోస్‌ ఎదుర్కొన్న నష్టాలు కేవలం కాగితానికే పరిమితం. ఒకవేళ అమెజాన్‌ షేర్లు మళ్లీ పుంజుకుంటే.. ఆయన సంపద తిరిగి పెరుగుతుంది. అమెజాన్‌ షేర్ల పతనంతో శుక్రవారం అమెరికా ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన నాస్డాక్‌ సూచీ సైతం భారీగా దిగజారింది.