Begin typing your search above and press return to search.

క‌విత కారులో 'కాంగ్రెస్ ముస‌లి పులి'!

By:  Tupaki Desk   |   3 July 2018 6:38 AM GMT
క‌విత కారులో కాంగ్రెస్ ముస‌లి పులి!
X
రాజ‌కీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఈ విష‌యం తాజాగా క‌నిపించిన దృశ్యం చూస్తే నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. దాదాపు ఏడాది ముందు నిజామాబాద్ ఎంపీ క‌మ్ కేసీఆర్ కుమార్తె క‌విత ఒక బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిని (జ‌గిత్యాల‌) ముస‌లి సింహంగా ఆమె అభివ‌ర్ణించారు.

కాంగ్రెస్ పార్టీ నేత‌లు పలువురు టీఆర్ ఎస్ లో చేరుతుంటే.. జీవ‌న్ రెడ్డి వారికి ఫోన్ చేసి.. తాను అది చేస్తా.. ఇది చేస్తా.. మీరు పార్టీ మార‌కండ‌ని చెబుతున్నార‌ని.. అయిన‌ప్ప‌టికీ వారు మాత్రం గులాబీ కారు ఎక్కేందుకు వ‌చ్చేస్తున్న‌ట్లు చెప్పారు. ఆ ఒక్క‌సారే కాదు.. అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారీ జీవ‌న్ రెడ్డిని ఉద్దేశించి క‌విత తీవ్ర వ్యాఖ్య‌లే చేసేవారు.

అలాంటి క‌విత కారులో జీవ‌న్ రెడ్డి ప్ర‌యాణించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని మెచ్చి ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ లో చేరుతున్నార‌న్న ఆమె.. ప‌లువురు నేత‌లు టీఆర్ ఎస్ లో చేర‌టం ప్ర‌తిప‌క్షాల గుండెల్లో గుబులు మొద‌లైంద‌ని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ తో క‌లిసి హాజ‌రైన స‌మావేశానికి ఎంపీ క‌విత‌తో పాటు.. సీనియ‌ర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఒకేకారులో కలిసి రావ‌టం రాజ‌కీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త‌న‌ను త‌ర‌చూ టార్గెట్ చేసే క‌విత పై జీవ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు చేసే వారు. రాజ‌కీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్న‌ప్పుడు ఇలా మాటా.. మాటా అనుకోవ‌టం కామ‌న్‌. ఎప్పుడైతే పార్టీల తేడా లేకుండా పోతుందో అంతా ఒక‌టైపోతుంది. తాజా ప‌రిణామం చూస్తుంటే.. జీవ‌న్ రెడ్డి సైతం గులాబీ కారు ఎక్క‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. తెలంగాణ‌లో ఏదో చేస్తామ‌ని చెబుతున్న కాంగ్రెస్ నేత‌ల‌కు క‌రెంట్ షాక్ త‌గిలిన చందంగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.