Begin typing your search above and press return to search.

ఆ ఒక్క‌ మాట‌..బీజేపీకి వ‌రం - జేడీఎస్‌ కు శాపం!

By:  Tupaki Desk   |   15 May 2018 8:19 AM GMT
ఆ ఒక్క‌ మాట‌..బీజేపీకి వ‌రం - జేడీఎస్‌ కు శాపం!
X
దేవేగౌడ.. మాజీ ప్ర‌ధాని. ఆయ‌న త‌న‌యుడు కుమార‌స్వామి... మాజీ ముఖ్య‌మంత్రి. పైగా వారికి మ‌ద్ద‌తుగా ఉన్న ఒక్క‌ళిగ కులం క‌ర్ణాట‌క‌లో చాలా బ‌ల‌మైన కులం. లౌకిక వాదులు, ద‌ళితుల మ‌ద్ద‌తు కూడా జేడీఎస్‌ కు బానే ఉంది. నిజానికి ఈ ఎన్నిక‌ల్లో కింగ్ మేక‌ర్ అయ్యి చ‌క్రం తిప్పాల్సిన పార్టీ. అంద‌రూ అంచ‌నాలు వేసిన‌ట్లు - స‌ర్వేలు చెప్పిన‌ట్లు ఆ పార్టీకి సీట్లు వ‌చ్చాయ‌నుకుంటున్నారు. కానీ దేవేగౌడ వేసిన అంచ‌నా మాత్రం ఇది కాదు. వారు కింగ్ లు అవుదాం అనుకున్నారు.

నిజానికి జేడీఎస్ స‌భ‌ల‌కు జ‌నం నుంచి మంచి మ‌ద్ద‌తు వ‌చ్చింది. దీంతో వారి ఆత్మ‌విశ్వాసం అతివిశ్వాసంగా మారింది. దీంతో ఒక బ‌రువైన మాట‌ను వాడారు. *హంగ్ వ‌స్తే మ‌ళ్లీ ఎన్నిక‌లే. మేము ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వం* అని దేవేగౌడ ప్ర‌క‌టించారు. ఇది ఆ పార్టీకి న‌ష్టం చేసింది. వారు దానిని ప‌దేప‌దే ప్ర‌చారం చేశారు. ఈ మాట‌తో కొంద‌రు జేడీఎస్‌కు వేయాల‌నుకున్న ఆలోచ‌నాప‌రులు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. జేడీఎస్ ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే అన‌వ‌స‌రంగా ఓటు వేస్ట‌వుతుంద‌న్న భావ‌న జ‌నంలో క‌లిగింది. మ‌ళ్లీ ఎన్నిక‌లా? అని భ‌య‌ప‌డ్డారు. దీంతో కొంత ఓటు శాతం బీజేపీ వైపు మొగ్గు చూపింది. చాలా చోట్ల బీజేపీ అతిత‌క్కువ మెజారిటీతో గెల‌వ‌డానికి ఇది కూడా ఒక కార‌ణం. అక్క‌డ ఓడిపోవాల్సిన సీటును బీజేపీ గెలిచింది అంటే... జేడీఎస్ పై న‌మ్మ‌కం స‌డ‌లిపోవ‌డ‌మే. అందుకే చాలా సింపుల్ మెజారిటీతో బీజేపీ అధికారం చేప‌ట్ట‌నుంది.

ఒక‌వేళ బీజేపీతో ముందే క‌లిసినా వారికి ఇన్ని సీట్లు గెల‌వ‌క‌పోయేవారు గానీ అధికారంలో ఉండేవారు. ఒక‌వేళ మ‌ళ్లీ ఎన్నిక‌లు అనే మాటను జ‌నంలోకి తీసుకెళ్ల‌క‌పోయినా ఒక ప‌ది సీట్లు తేడా వ‌చ్చినా ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పేవారు. కానీ ఒక చిన్న త‌ప్పుతో అధికారాన్ని తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టింది జేడీఎస్‌.