Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ తేల్చ‌క‌పోతే..కాంగ్రెస్ సంక్షోభం సృష్టిస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   15 May 2018 1:51 PM GMT
గ‌వ‌ర్న‌ర్ తేల్చ‌క‌పోతే..కాంగ్రెస్ సంక్షోభం సృష్టిస్తుంద‌ట‌
X
క‌న్న రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అసెంబ్లీ ఫ‌లితాలు వెల్ల‌డి త‌ర్వాత ఆ రాష్ట్రంలో రాజ‌కీయంగా మ‌రింత ఉత్కంఠ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ఏర్పాటుకు సిద్ధ‌మైన కాంగ్రెస్ మంగళవారం సాయంత్రం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, డీకే శివకుమార్, జేడీ(ఎస్) తరఫున కుమారస్వామి కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు. కాంగ్రెస్ మద్దతుతో జేడీ(ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(ఎస్) నేత కుమారస్వామి గవర్నర్ అనుమతి కోరారు.

సమావేశం అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాట్లాడుతూ...``ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. జేడీఎస్‌కు పూర్తి మద్దతిచ్చాం. మద్దతు నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా దేవెగౌడకు తెలిపాం. గవర్నర్ నిర్ణయం తీసుకున్న తరువాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం`` అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తూ మా పార్టీ జాతీయాధ్యక్షుడికి లేఖ ఇచ్చిందని కుమారస్వామి వెల్లడించారు. ``ఇరుపార్టీ నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరాం. కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం` అని కుమారస్వామి అన్నారు. కాగా, జేడీఎస్‌కు సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్లు ఈ సందర్భంగా సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ తీర్మానాన్ని లేఖ ద్వారా గవర్నర్‌కు వివరించాం. దేవెగౌడకు కూడా లేఖ ద్వారా మద్దతు విషయాన్ని తెలియజేశాం. మా మద్దతును జేడీఎస్ అంగీకరించిందని, మాకు 118 సభ్యుల సంఖ్యాబలం ఉందని సిద్ధూ తెలిపారు.

మ‌రోవైపు కర్ణాటక రాజకీయం రాజ్‌భవన్‌లో కీలకమలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటులో ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(104) తరఫున యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్ గవర్నర్‌ను కలిశారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్‌ ను కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి 7 రోజుల గడువు ఇచ్చారు. వారంలోగా కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే గోవాలో రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హ‌రించిన రీతిలో ఇక్క‌డ కూడా చేస్తున్నార‌నే ఉద్దేశాన్ని పేర్కొంటూ ఢిల్లీ వేదిక‌గా ఆందోళ‌న చేయాల‌ని ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.