Begin typing your search above and press return to search.

కేసీఆర్ మిత్రుడికి వదినతో పెద్ద తలనొప్పే వచ్చి పడిందే

By:  Tupaki Desk   |   1 April 2023 2:15 PM GMT
కేసీఆర్ మిత్రుడికి వదినతో పెద్ద తలనొప్పే వచ్చి పడిందే
X
కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికల వేడి రగులుకుంది. అధికారపక్షమైన బీజేపీ.. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. దక్షిణాదిన తమ పట్టు మరింత పెరిగిందన్న విషయాన్ని మరోసారి రుజువు చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతతో ఈసారి తమకు అవకాశం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ ఎన్నికలతో తమకున్న గడ్డు పరిస్థితి నుంచి బయటకు వస్తామని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జేడీఎస్ మాత్రం తమకున్న పరిమితమైన వనరులకు.. కొత్త మిత్రుడు కేసీఆర్ పుణ్యమా అని.. ఈసారి మరిన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.

అయితే.. జేడీఎస్ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఇప్పుడు ఇంటిపోరు పెరిగింది. తన సోదరుడు రేవణ్ణ తన సతీమణి భవానిని బరిలోకి దించాలన్న పట్టుదలతో ఉన్నారు. దీన్ని కుమారస్వామి వ్యతిరేకిస్తున్నారు. దీంతో.. తాజా ఎన్నికలు దేవగౌడ్ ఇంట్లో కలకలానికి కారణంగా మారిందంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన హసన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు.

అయితే.. ఆ స్థానం నుంచి తన భార్యను పోటీ చేయించాలని రేవణ్ణ పట్టుదలతో ఉండటం.. ఆయనకు పార్టీ అధినేత దేవగౌడ దన్నుగా నిలిచినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు జోతిష్యులు సైతం ఆమెను బరిలోకి దింపితే బాగుంటుందన్న మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. వదిన ఎన్నికల బరిలో దిగితే.. తమ పార్టీ మీద కుటుంబ ముద్ర పడుతుందని.. ఇది తమ అవకాశాల్ని మరింత దెబ్బ తీస్తుందన్న భాయందోళనలో కుమారస్వామి ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ మొత్తం పరిణామం జేడీఎస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కీలక ఎన్నికల వేళ.. వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించటం ఎలా అనే కన్నా.. కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు పోటీ చేయాలి? వద్దు? అనే అంశంపైనే ఎక్కువ చర్చ సాగుతోంది.