Begin typing your search above and press return to search.

జేడీ శీలం..ఎంత కాలమని వెయిట్ చేస్తారు..?

By:  Tupaki Desk   |   13 Sept 2017 11:47 AM IST
జేడీ శీలం..ఎంత కాలమని వెయిట్ చేస్తారు..?
X
ఏపీ కాంగ్రెస్లో జేడీ శీలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఒకప్పుడు ఆయన కర్నాటక కేడర్ ఐఎఎస్ అధికారి. పదిహేనేళ్ల పాటు పని చేశాక రాజకీయాలపై మోజు పెరిగి... కాంగ్రెస్లో చేరారు. ఆపై ఎంపీ అయ్యాక ఈ గుంటూరు నేతను ఏరి కోరి మరీ అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రిని చేసింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాలతో ఏపీలో కాంగ్రెస్ కథ కంచికెళ్లిపోయింది. దాంతో చాలా మంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసినా జేడీ శీలం లాంటి నేతలు మాత్రం ఆ పార్టీనే నమ్ముకుంటూ వచ్చారు. ఎప్పటికైనా వసంతం మళ్లీ రాకపోతుందా..? మరోసారి కేంద్ర మంత్రి కాకపోతానా అనుకున్నారు. కానీ మొన్న నంద్యాల ఫలితం, ఆ పై కాకినాడ రిజల్ట్ తర్వాత ఆయనకు కూడా కాంగ్రెస్ అంటే పూర్తిగా నమ్మకం పోయినట్టే కనిపిస్తోంది.

అసలు విషయం ఏంటంటే గుంటూరు నేత కావడంతో ఆయన పవర్ లేని ఢిల్లీని నమ్ముకునే కన్నా పక్కనే పవర్లో ఉన్న అమరావతిలో కలిసిపోవడం బెటరని భావిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఈ మధ్య ఆయన తరచు ఏపీ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకని ఆరాతీస్తే చంద్రబాబు దర్శనానికని తేలింది. ఇంతకీ అసలు విషయమేంటా అని కూపీ లాగేసరికి చంద్రబాబుతో జేడీ ప్రత్యేకంగా చర్చించాల్సిన విషయాలు ఉన్నాయట. దాంతో మాజీ మంత్రిగారికి ఈ సమయంలో టీడీపీ అధినేతతో చర్చించాల్సిందేముంటుంది రాజకీయాలు తప్ప అని చెవులు కొరుక్కుంటున్నారు జనం.

కాంగ్రెస్ నేతలైతే ఆయన తీరును చూసి ఆ .. మరో వికెట్ రెడీ అయ్యిందని అనుకుంటున్నారట. అసలు విషయమేంటంటే... జేడీ ఎంత తొందర పడుతుంటే... చంద్రబాబు అంత ఆలస్యం చేస్తున్నారట. ఆయనెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని వేచి చూస్తున్నారట మన మాజీ మంత్రిగారు. మొత్తానిని త్వరలోనే పచ్చ కండువా కప్పుకున్న శీలాన్ని చూడబోతున్నట్టే ఉన్నాం.