Begin typing your search above and press return to search.

నేనూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానినే: జేడీ లక్ష్మీనారాయణ

By:  Tupaki Desk   |   11 Aug 2021 4:50 AM GMT
నేనూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానినే: జేడీ లక్ష్మీనారాయణ
X
తెలంగాణ గురుకులాల గతిని మార్చిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి తుఫాన్ సృష్టించాడు. బీఎస్పీలో చేరి కొత్త రాజకీయ పార్టీగా తెలంగాణలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.ప్రవీణ్ బీఎస్పీలో చేరడంతో ఆ పార్టీకి కొత్త జోష్ వచ్చింది.

దళితులను , మైనారిటీలను ఏకం చేసే ఎజెండాను చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీతో ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ శిబిరంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం టీఆర్ఎస్ నే టార్గెట్ చేయడం.. టీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేయడంతో ఇప్పుడు వార్ ఆసక్తిగా మారింది. ఇప్పుడు దళితబంధుతో ఎస్సీలకు దగ్గరకావడానికి ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ వారి నమ్మకాన్ని గెలుచుకోవడం కష్టతరంగా మారింది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందే ఐపీఎస్ పదవిని వదలుకొని ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశంపై స్పందించారు. దీనిని స్వాగతించారు. ‘నేను ప్రవీణ్ కుమార్ అభిమానిని.. స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్న తర్వాత అతడిని అభినందించిన మొదటి వ్యక్తిని నేను. అతను అనుభవజ్ఞుడైన వ్యక్తి. తెలంగాణలోని గురుకుల పాఠశాలలను మెరుగుపరుచడంలో కీలక పాత్ర పోషించాడు’ అని లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పనిచేయడం గురించిన ప్రశ్నించగా.. ఇద్దరికీ ఉమ్మడి ఆలోచన ప్రక్రియ ఉందని జేడీ లక్ష్మీనారాయణ సమాధానం ఇచ్చారు. ‘ప్రవీణ్ కుమార్, తాను బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ మార్గాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఇది బహుజనులను శక్తివంతం చేయడం.. వారికి రాజ్యాంగపరమైన అధికారాలను ఇవ్వడం.. నా సిద్ధాంతం ఈ దేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ అధికారాల విలువను తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని అత్యున్నత ఉద్యోగాలలో ఒకటైన ఐపీఎస్ లను త్యజించిన లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్ ఇద్దరూ తమ పని ద్వారా ఎంతో ప్రశంసలు పొందారు. లక్ష్మీనారాయణ, ప్రవీణ్ ఒక శక్తిలో చేరాలని, సమాజంలో మార్పును తీసుకురావాలని ఆశిద్ధాం.