Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌పై జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప‌వ‌ర్‌ఫుల్ సెటైర్లు ఇవే!

By:  Tupaki Desk   |   22 Sep 2022 8:30 AM GMT
జ‌గ‌న్‌పై జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప‌వ‌ర్‌ఫుల్ సెటైర్లు ఇవే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ‌లో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి పేరు మార్చి వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా పెట్ట‌డంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికే అన్ని ప్ర‌తిప‌క్షాలు ఖండించాయి.

ఇక టీడీపీ అయితే తాము అధికారంలోకి రాగానే యూనివ‌ర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడ‌తామ‌ని తేల్చిచెప్పింది. సొంత పార్టీలో యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్‌, వంశీమోహ‌న్ లాంటి వాళ్లు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌కు ఝుల‌క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సాక్షాత్తూ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల సైతం త‌న అన్న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ కూడా జ‌గ‌న్ నిర్ణ‌యంపై మండిప‌డ్డారు. త‌మిళ‌నాడులోని స్టాలిన్ ప్ర‌భుత్వంతో పోలుస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ఏకిప‌డేశారు. త‌మిళ‌నాడులో డీఎంకే ప్ర‌భుత్వం.. అన్నాడీఎంకే నాయ‌కురాలు, మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఫొటోతో ఉన్న స్కూలు బ్యాగుల‌ను కూడా పంపిణీ చేసి ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు.

ఇక్క‌డేమో పాల‌కులు మారిన‌ప్ప‌డ‌ల్లా పేర్లు మార్చుకుంటూ నానాయాగీ చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పేరు మార్పు కాద‌ని.. వ్యవస్ధలను రిపేరు చేయాల‌ని లక్ష్మీనారాయ‌ణ ట్వీట్ చేశారు.

'మన పక్కరాష్ట్రం తమిళనాడులో సీఎం స్టాలిన్.. మాజీ సీఎం జయలలిత బొమ్మలతో ఉన్న స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి తన ఔనత్యాన్ని చాటారు. మనమేమో ఇక్కడ పాలకులు మారినపుడల్లా పేర్లు మార్చుకుంటూ నానా యాగీ చేస్తున్నాం. పేరు మార్పు కాదు.. వ్యవస్ధల రిపేరు కావాలి' అంటూ ల‌క్ష్మీనారాయ‌ణ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

మ‌రి ప్ర‌తిప‌క్షాలు, సొంత పార్టీ నేత‌ల అభిప్రాయాలు, వివిధ సంఘాలు వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్న నేప‌థ్యంలో మ‌రి ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటారా లేదా అనేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఈ అంశం రానున్న రోజుల్లో మ‌రింత తీవ్ర‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.