Begin typing your search above and press return to search.

బాబు సీఎం... పవన్ డిప్యూటీ సీఎం.. అపుడే పంచేసుకున్నారా...?

By:  Tupaki Desk   |   30 Oct 2022 8:29 AM GMT
బాబు సీఎం... పవన్ డిప్యూటీ సీఎం.. అపుడే పంచేసుకున్నారా...?
X
ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న పొత్తు టీడీపీ జనసేన అని అంటున్నారు. నిజానికి ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడా పొత్తు అయితే కుదరలేదు. కానీ కుదిరే చాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్న మాట. దాంతోనే ఇపుడు ఎక్కడ చూసినా ఈ రెండు పార్టీల గురించే చర్చ సాగుతోంది. ఈ రెండు పార్టీలు కూటమి కట్టి బరిలోకి దిగితే కచ్చితంగా అధికారంలోకి వస్తాయని లెక్కలేసే వారూ ఉన్నారు.

అదే కనుక జరిగితే ఎవరు సీఎం అవుతారు అని కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిజానికి పవన్ సీఎం అంటూ ఆయన ఫ్యాన్స్ కానీ జనసైనికులు కానీ హోరెత్తిస్తున్నారు. పవన్ సైతం 2019 ఎన్నికల ముందు తాను సీఎం అవుతానని చెప్పుకున్నారు. ఇక గత మూడేళ్ళుగా చూసినా పవన్ అజెండా కూడా అలాగే ఉంది. రీసెంట్ గా మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సైతం ఈసారి అసెంబ్లీలో జనసేన జెండా ఎగరాలని పవన్ బల్ల గుద్ది మరీ చెప్పారు.

రాజకీయాల్లోకి జనసేన వచ్చి 2024 ఎన్నికలకు పదేళ్ళు అవుతోంది. మరి ఈ ఎన్నికల్లో అయినా పవన్ సీఎం కాకపోతే ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడతారు. అయితే రాజకీయ పరిణామాలు చూస్తే చంద్రబాబు టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబే సీఎం అవుతారు. ఇది ఎవరిని అడిగినా చెప్పే విషయం. మరి పవన్ ఎపుడు సీఎం అవుతారు. అంటే దానికి కూడా లెక్కలు ఉన్నాయని అనే వారు ఉన్నారు. అయితే జన్సేనలో కొన్నాళ్ళు ఉండి ఆ పార్టీ తరఫున ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ అయితే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పొత్తుల గురించి పదవుల పంపకం గురించి చాలా విషయాలు చెప్పారు.

మరి అది ఆయన అంచనా కావచ్చు, లేక జోస్యం కావచ్చు. లేక ఆయన విశ్లేషణ కావచ్చు 2024 ఎన్నికల తరువాత ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు అంటే దానికి ఆయన చాలా సింపుల్ గా చంద్రబాబు సీఎం అయితే పవన్ డిప్యూటీ సీఎం గా ఉంటారు అని బదులిచ్చారు. ఇది చాలా సింపుల్ గా ఆయన చెప్పినా రాజకీయంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న విషయంగానే చూడాల్సి ఉంటుంది.

నిజానికి చంద్రబాబు గత వర్షాకాల సమావేశాల సందర్భంగా ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. తాను మళ్ళీ సీఎం గానే అసెంబ్లీకి వస్తాను అని బాబు శపధమే చేశారు. దాని ప్రకారం చూస్తే కచ్చితంగా చంద్రబాబు సీఎం కావాల్సి ఉంటుంది. ఇక పవన్ వైపు చూస్తే ఆయన సీఎం కావాలని లక్షలాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరు అవుతారు అంటే చిక్కు ప్రశ్నే.

దానికి జేడీ చెప్పినది చూస్తే పవన్ కళ్యాణ్ తన సినిమాల్లోనే ఒక దానిలో ఎక్కడ నెగ్గాలో కాదు, తగ్గాలో తెలియాలి ఒక పవర్ ఫుల్ డైలాగ్ వాడతారు. ఆ విధంగా చూస్తే కనుక పవన్ ఏపీలో రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో తగ్గి డిప్యూటీ సీఎం గా కూడా అంగీకరించవచ్చు అని జేడీ అభిప్రాయపడుతున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో జరిగినట్లుగా పవన్ చంద్రబాబు చెరి రెండున్నరేళ్ళ పాటు అధికారాన్ని అంచుకోవచ్చు అని కూడా ఆయన మరో అధికార వాటా సూత్రాన్ని కూడా చెప్పుకొచ్చారు.

అంటే ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రాతిపదికన ఎక్కువ సీట్లు వచ్చిన వారు తొలి సీఎం అవుతారు. రెండున్నరేళ్ల తరువాత మరొకరు సీఎం అవుతారు. ఇది కూడా మంచి ఒప్పందమే ఇలా కూడా జరగవచ్చు అని కూడా ఆయన అన్నారు. అంతే కాదు, ఏ పార్టీకి ఎన్ని క్యాబినెట్‌ బెర్త్‌లు, ఏయే శాఖలు అనే విషయాలపై కూటమి పార్టీలు ఒక అవగాహనకు వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కాకుండా రాష్ట్రాన్ని కాపాడేందుకు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని అయన గుర్తు చేశారు. అందువల్ల ఏ పార్టీకి ఎన్ని క్యాబినెట్‌ బెర్త్‌లు వస్తాయనేది సమస్య కాదు అని జేడీ అంటున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా అసలు జేడీ తన ఆలోచనలుగా ఇవన్నీ చెప్పారా లేక ఆయనకు జనసేనతో ఉన్న పాత పరిచయాల నేపధ్యంలో రెండు పార్టీలూ ఎలా ముందుకు సాగాలన్నది ఆయనకు ఏమైనా సమాచారం అంది ఇలా చెబుతున్నారా అన్నది ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా అధికార వాటా రెండు పార్టీల మధ్య ఇబ్బంది కాదు అని జేడీ లాంటి వారు అంటున్నారు కాబట్టి ఇక కూటమి గెలుపే ఇపుడు ప్రధానం కానుంది అనుకోవాలి.