Begin typing your search above and press return to search.

జేడీ విత్ టీడీపీ : అదన్న మాట విషయం...?

By:  Tupaki Desk   |   27 May 2022 1:30 AM GMT
జేడీ విత్ టీడీపీ : అదన్న మాట విషయం...?
X
ఆయన సీబీఐ మాజీ అధికారి. అత్యున్నతమైన స్థాయిలో పనిచేస్తూ స్వచ్చందంగా తన పదవికి రాజీనామా చేసి ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. వివేకానందుని ఆశయాలను బలంగా నమ్మే ఆయన జేడీ లక్ష్మీ నారాయణ. విశాఖను తన రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకుని జేడీ కొన్నేళ్ళుగా పనిచేస్తున్నారు. ఎప్పటికైనా విశాఖ లోక్ సభ స్థానం నుంచి నెగ్గి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని జేడీ ఆలోంచన.

నిజానికి 2019 ఎన్నికల్లో కూడా ఆయన అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. కేవలం పదిహేను రోజులు మాత్రమే వ్యవధి ఉండగా బరిలోకి దిగిన జేడీ జనసేన తరఫున పోటీ చేశారు. రెండు లక్షల డెబ్బై వేల పై చిలుకు ఓట్లను తెచ్చుకుని ఆయన అటు వైసీపీ, ఇటు టీడీపీలకు ఖంగు తినిపించారు. ఇక ఆ తరువాత జనసేనలో ఇమడలేక దూరం అయ్యారు.

ఇక ఆయన ప్రస్తుతం స్వచ్చందంగా సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని కూడా చెబుతున్నారు. ఈ మధ్య ఆప్ ఏపీ ప్రెసిడెంట్ గా జేడీ లక్ష్మీనారాయణ నియమితులు అవుతారు అన్న వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో అవి ఆగాయి. ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ గా ఒక ప్రచారం మొదలైంది.

జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ బరిలో ఉంటారని. ఆయన తొందరలో టీడీపీలో చేరబోతున్నారు అని. దానికి జేడీ ఫుల్ క్లారిటీతో ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. టీడీపీలో చేరే విషయం కూడా వట్టిది. అది పుకారు మాత్రమే అని ఆయన అంటున్నారు. ఇలాంటి విషయాల మీద ఆసక్తిని చూపి ఎవరూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని జేడీ సూచిస్తున్నారు.

మొత్తానికి జేడీ తెలుగుదేశం పార్టీతో చేరేది లేదు అంటున్నారు. ఆయన జనసేనను వదిలేశారు. వైసీపీలో ఎటూ చేరరు. మరి ఆయనకు ఉన్న ఆప్షన్లు ఏంటి అన్న చర్చ అయితే వస్తోంది. తాను మాత్రం రాజకీయాల్లో ఉంటాను అని అంటున్నారు. మరి జేడీ రూట్ ఎటు అన్నదే చర్చ. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం ఉన్నా దానికీ క్లారిటీ లేదు. మళ్లీ జనసేనలో చేరి పోటీ చేస్తారు అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా జేడీ మాత్రం తాను టీడీపీలో చేరడంలేదు అని చెప్పేశారు కాబట్టి ఆ చర్చకు అయితే ఫుల్ స్టాప్ పడింది.