Begin typing your search above and press return to search.

నిజ‌మా?... మాజీ జేడీకి వైసీపీ ఆహ్వాన‌మా?

By:  Tupaki Desk   |   28 March 2019 1:26 PM GMT
నిజ‌మా?... మాజీ జేడీకి వైసీపీ ఆహ్వాన‌మా?
X
సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ... త‌న సుదీర్ఘమైన పోలీసు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ లో సీబీఐలో ఉన్న‌ప్పుడు సంపాదించిన క్రెడిట్ మ‌రెప్పుడూ రాలేద‌నే చెప్పాలి. ల‌క్ష్మీనారాయ‌ణ సీబీఐ జేడీ గా ఉన్న స‌మ‌యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు న‌మోదు కావ‌డం - ఆ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు ల‌క్ష్మీనారాయ‌ణ చేతికే ద‌క్క‌డం తెలిసిందే. జ‌గ‌న్‌ ను ఏకంగా అరెస్ట్ చేసేసిన ల‌క్ష్మీనారాయ‌ణ నాడు ఓ హీరోగా వెలుగు వెలిగారు.

ఆ త‌ర్వాత జ‌గ‌న్ బ‌య‌ట‌కు రావ‌డం - ల‌క్ష్మీనారాయ‌ణ సీబీఐ నుంచి త‌న కేడ‌ర్ రాష్ట్రం అయిన మ‌హారాష్ట్రకు వెళ్లిపోవ‌డం జ‌రిగిపోయాయి. అయితే ఏడాదిన్న‌ర ముందు పోలీసు వృత్తికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అయితే కొత్త పార్టీ పెడ‌తారా? లేక ఏదైనా పార్టీలో చేర‌తారా? అన్న ప్ర‌శ్న‌కు చాన్నాళ్లుగా స‌మాధానం దాట‌వేస్తూ వ‌చ్చిన ల‌క్ష్మీనారాయ‌ణ సొంత పార్టీ పెట్టే దిశ‌గానే సాగారు. అయితే అది కుద‌ర‌క‌... జ‌న‌సేన‌లో చేరిపోయారు.

ల‌క్ష్మీనారాయ‌ణ ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసిన నాడే... ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌తార‌ని ఊహాగానాలు వినిపించాయి. అయితే దానిని ఆయ‌న నాడు ఖండించారు. ఇక టీడీపీలోనూ ఆయ‌న చేర‌తార‌ని వార్త‌లు వినిపించినా... వాటినీ ఆయ‌న ఖండించారు. ఈ వార్త‌ల‌న్నీ ఓకే అనుకున్నా... ల‌క్ష్మీనార‌య‌ణ స్వ‌యంగా తాను అరెస్ట్ చేసిన జ‌గ‌న్ పార్టీలో చేర‌తార‌ని మాత్రం ఏ ఒక్క‌రూ అనుకోలేదు. ఎందుకంటే... త‌న‌ను అరెస్ట్ చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ‌ను జ‌గ‌న్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటారు? నిజ‌మే... వైసీపీలో ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలో చేర‌తార‌ని ఏ ఒక్క‌రూ అనుకోలేదు. ఈ క్ర‌మంలోనే వైసీపీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీల నుంచి ఆయ‌న‌కు ఆహ్వానం అంది ఉంటుంద‌ని భావ‌న వ్య‌క్త‌మైంది.

అయితే త‌న‌కు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం అందింద‌ని చెప్పి ల‌క్ష్మీనారాయ‌ణ పెను సంచ‌ల‌నం రేపారు. ఓ టీవీ న్యూస్ ఛానెల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంగా ల‌క్ష్మీనారాయ‌ణ ఈ బాంబులాంటి వార్త‌ను పేల్చారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత వైసీపీలో చేరాలంటూ త‌న‌కు ఆహ్వానం అందింద‌ని చెప్పిన ల‌క్ష్మీనారాయ‌ణ... ఆ ఆహ్వానం ప‌లికిన వైసీపీ నేత ఎవ‌ర‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. మొత్తంగా ఈ మాట చెప్పిన ల‌క్ష్మీనారాయ‌ణ పెను క‌ల‌క‌ల‌మే రేపార‌ని చెప్పాలి.