Begin typing your search above and press return to search.

బాబు నిర్ణ‌యం అవినీతిని పెంచేందుకేన‌ట‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 6:38 AM GMT
బాబు నిర్ణ‌యం అవినీతిని పెంచేందుకేన‌ట‌
X
ఏపీలో సీబీఐ వరుస దాడుల నేపథ్యంలో....కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అనుమతిని ఎత్తివేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ సీబీఐ విషయంలో విధించిన జీవోతో కేంద్రానికి షాక్ ఇచ్చిందని కొందరు ఎప్ప‌ట్లాగే ప్ర‌చారంలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ లో సోదాలు చేపట్టే అధికారాన్ని సీబీఐకి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోగుట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ మినహా మిగతా రాష్ర్టాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ర్టాల సాధారణ అనుమతి అవసరం. ఏపీలోకి సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ఈ సమ్మతి ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేతల నివాసాలు - కార్యాలయాల్లో ఇటీవలి సీబీఐ సోదాలు - భవిష్యత్తులో మరిన్ని సోదాలు జరుగుతాయనే భయాల నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతున్నది.

సీబీఐ తన అధికారాలను వినియోగించుకోనేందుకు గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ ను ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీచేసిన ఫలితంగా అక్కడ కేంద్ర ప్రభుత్వశాఖలు - కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేసే ఉద్యోగుల నివాసాలు - కార్యాలయాల్లో తనిఖీలు చేసే అవకాశం సీబీఐకి ఉండదు. సీబీఐ పరిధి రద్దవుతుంది. ఇకపై ఏపీలో సీబీఐ పాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఏసీబీని పోషిస్తుంది. ఇదే ఈ నిర్ణయం వెనుక అసలు మతలబని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి కేసుల విషయంలో బాబు భయపడుతున్నారని, వాటినుంచి తప్పించుకునేందుకు.. తమ నేతలపై సోదాలు జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నాయకులు - మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్క్యులర్ ఏ మేరకు న్యాయబద్ధమైనదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈ ఎపిసోడ్‌ పై తాజాగా స్పందించారు. సీబీఐ రాష్ట్రంలో ఎటువంటి సోదాలు - దర్యాప్తులు చేయకుండా సమ్మతిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయడం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మంచి పరిణామం కాదని లక్ష్మీనారాయణ అన్నారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించకపోతే అవినీతి పెరిగే అవకాశం ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సంస్థలు గాడితప్పే ప్రమాదం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కోర్టుకు వెళ్లవచ్చని ఆయన అన్నారు. అక్రమ సంపాదన ఆర్జించే వారికి కొమ్ముకాయటానికి - అవినీతిని ప్రోత్సహించేందుకే ఏపీ ముఖ్యమంత్రి ఈ చర్యకు పాల్పడ్డారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడటం బయటపడకుండా ఉండడం ఎలా అనే డాక్యుమెంట్ బాబు రాసుకోవాలి అని వ్యాఖ్యానించారు.