Begin typing your search above and press return to search.

నాయకత్వం - బ్యూరోక్రాట్స్ కు నప్పదా.?

By:  Tupaki Desk   |   26 Nov 2018 10:11 AM IST
నాయకత్వం - బ్యూరోక్రాట్స్ కు నప్పదా.?
X
ప్రశ్నించేవాళ్లంతా నాయకులు కాలేరు.. ఆవేశంతో ముందుకొచ్చిన వాళ్లంతా సీఎంలు కాలేరు.. విజిల్ బ్లోయర్స్ పాత్రలో ఒదిగిన వాళ్లు రాజకీయాల్లో తేలిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏపీ ముఖ చిత్రంపై కొత్త గా వస్తున్న జేడీ లక్ష్మీనారాయణ తాజాగా లోక్ సత్తాలో చేరి ఏపీ రాజకీయ యవనికపై ప్రముఖ పాత్ర పోషించాలని ఆశిస్తున్నారు. సొంతంగా జనధ్వని పార్టీ పెడదామని ఆలోచించినా అది చాలా ఖర్చు - రిస్క్ తో కూడిన పని అనుకొని మరో బ్యూరోక్రాట్ ప్రారంభించిన లోక్ సత్తా పార్టీని ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యూరోక్రాట్లు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సామాజిక - స్వచ్ఛంద సంస్థల పేరుతో మొదట సంస్థలను స్థాపించి రాజకీయాలను ఏలుదామని కలలుగన్న వారిని జనం తిరస్కరించిన ఉదంతాలే ఎక్కువున్నాయి. అప్పట్లో ఢిల్లీలో అన్నా హాజరే నేతృత్వంలో కేజ్రీవాల్ - కిరణ్ బేడీ లాంటి ప్రముఖులు విజిల్ బ్లోయర్స్ గా మారి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఇందులో కేజ్రీవాల్ పార్టీ పెట్టి సక్సెస్ కాగా .. కిరణ్ బేడి మాత్రం విఫలమయ్యారు. ఇప్పుడు ఏపీలో జనసేన పేరుతో ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తానన్న పవన్ ఇంతవరకూ పోటీచేయడానికే సాహసించడం లేదు. పోటీ చేస్తే ఆయన బలం ఎంతనేది తేలుతుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు - పార్టీకి బలం లేకపోవడం.. పైగా పెద్ద నాయకుల లోటుతోనే జనసేన పోటీలోకి దిగకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.

ఇక ఏపీలో లోక్ సత్తా పేరుతో ఎన్నో స్వచ్ఛంద - సేవ కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు పొందిన జయప్రకాష్ నారాయణ తర్వాత లోక్ సత్తాను పార్టీగా మార్చి రాజకీయాల్లో పరీక్షించుకున్నారు. ఎంతో మంది ఆయన్ను రాజకీయాల్లోకి రావద్దన్నా సాహసించారు. కానీ అది ఫెయిల్ అయ్యింది. విజిల్ బ్లోయర్ గా గ్రాండ్ హిట్ అయిన జయప్రకాష్ నారాయణ రాజకీయ నాయకుడిగా మాత్రం విఫలమయ్యాడు. నాయకత్వం లక్షణాలు పుష్కలంగా ఉన్నా ఆయన్ను ప్రజలు తిరస్కరించారు. రాజకీయాల్లోకి వచ్చాక సుత్రాలు వల్లె వేస్తే కష్టమని వారితో కలిసి పోయి.. వారు ఆశించేలా పథకాలు - కార్యకర్తలు - పార్టీ నిర్మాణం ఉంటేనే విజయం దక్కుతుందని జయప్రకాష్ నారాయణ ఉదంతంతో నిరూపితమైంది.

ఇప్పుడు ఆయన లోక్ సత్తా పేరు మీదనే మరో బ్యూరోక్రాట్ జేడీ లక్ష్మీ నారాయణ ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆయన తలంపు ఎంతో మంచిదే అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏపీలో ఎంతమేరకు ప్రభావం చూపిస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఓవైపు టీడీపీ - బలమైన ప్రతిపక్షం వైసీపీ - మధ్యలో జనసేన ఉన్న నేపథ్యంలో ఈ విజిల్ బ్లోయర్ కు రాజకీయం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..