Begin typing your search above and press return to search.

తెలుగు బిడ్డ కోసం విరాళాలు...ఉక్కు ఉద్యమం లో బిగ్ ట్విస్ట్

By:  Tupaki Desk   |   16 April 2023 5:00 AM GMT
తెలుగు బిడ్డ కోసం విరాళాలు...ఉక్కు ఉద్యమం లో బిగ్ ట్విస్ట్
X
విశాఖ ఉక్కు కర్మాగారం మూలధనం సంపాదించుకోలేక ఇబ్బందుల పాలు అవుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రం అయిత్రే ప్రైవేటీకరణే అంటోంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే బిడ్లను ఆహ్వానించడం ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకోవాలనుకుంటోంది. అనూహ్యంగా రంగంలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ బిడ్ కాదు స్టీల్ ప్లాంట్ తెలుగు వారి బిడ్డ. అందుకోసం అంతా తలా ఒక చేయి వేసి సాయం అందిస్తే చాలు బతికి బట్టకడుతుంది అని అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ కి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న తొమ్మిది కోట్ల తెలుగు వారు అంతా కలసి తలా నెలకు ఒక వంద రూపాయలు ఇస్తే చాలు తొమ్మిది వందల కోట్లు పోగు అవుతాయని అంటున్నారు. అలా నాలుగు నెలల పాటు నాలుగేసి వందలు ఇస్తే చాలు స్టీల్ ప్లాంట్ కి అవసరం అయిన మూల ధనం నిధులు సమకూరుతాయని ఆయన అంటున్నారు.

అయితే నిజానికి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అవసరాలకు ఈ మొత్తం ఏ మూలకు సరిపోతుంది అన్నది ఇక్కడ పాయింట్. పైగా అయిదు వేల కోట్ల రూపాయలను ఆర్ధిక సాయంగా అందించాలని కేటీయార్ ఈ మధ్యనే కేంద్రానికి లేఖ రాశారు. అంటే స్టీల్ ప్లాంట్ కి అయిదు వేల కోట్ల రూపాయల నిధుల అవసరం ఉంది అన్న మాట.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ కి ఆ నిధులను కేంద్రం సమకూర్చి తన బాధ్యతను నిలబెట్టుకోవాలన్న సూచనలు ఉన్నాయి. అయితే స్టీల్ ప్లాంట్ కి ఎంత ఇచ్చినా నష్టాలే అని కేంద్రమే చేతులు దులుపుకుని పక్కకు పోతోంది. ఇక ఏపీ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాలూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయనీయమనే చెబుతున్నాయి.

మరి ఈ ప్రభుత్వాలు అయినా తమ పరంగా ఆర్ధికంగా ఎంతో కొంత ఆదుకుంటాయా అన్న చర్చ కూడా ఉంది. అయితే ఏపీ పరిస్థితి చూస్తే ఖజానా ఖాళీగా ఉంది. పైగా ప్రభుత్వ ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి. తెలంగాణా నుంచి నిధులను ఆశించడం అత్యాశే అవుతుందేమో. అక్కడ వారికి అనేక సమస్యలు ఉన్నాయి. పొరుగున ఉన్న ఒక కర్మాగారానికి నిధులు ఇస్తే అక్కడ ఖాయిలా పడిన మిగిలిన వాటి సంగతేంటి అన్న ప్రశ్న వస్తుంది.

ఇక ప్రజల నుంచి విరాళాలను ప్రతీ నేలా వంద రూపాయలు వంతున సేకరించడం ద్వారా ప్లాంట్ ని నిలబెడదామని జేడీ లక్ష్మీనారాయణ అనడం మంచిదే కానీ ఆ విధంగా స్పందన వస్తుందా అన్నది చూడాలి. ఇక క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్ ఫర్ వంటి విధానాల ద్వారా నిధుల సేకరణ అంటున్నారు. సరే ఈ ప్రయత్నం మంచిదే అనుకున్నా అయిదు వేల కోట్ల రూపాయలను విరాళాల రూపంలో సేకరించడం అయ్యే పనేనా అన్నది కీలకమైన ప్రశ్న.

ఇంకో వైపు చూస్తే స్టీల్ ప్లాంట్ కి ఆర్ధిక లోటు రావడం గత నాలుగు దశాబ్దాల కాలంలో ఇదే ప్రధమం కాదు అనేక సందర్భాలలో వచ్చింది. మరి ప్రతీ సారీ ఇన్ని వేల కోట్లను ఎక్కడ నుంచి సమకూరుస్తారు అన్నది చూడాలి. వీటి కంటే కేంద్రం తో పోరాడి అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయన్నది సొంత గనులు లేకపోవడం వల్ల కాబట్టి వాటిని కేటాయించమని కోరాలి. దాని కంటే ముందు తక్షణం అయిదు వేల కోట్ల రూపాయలను కేటాయించమని డిమాండ్ చేయాలి.

అయితే రెండేళ్ళు గడచినా స్టీల్ ప్లాంట్ ఉద్యమం టెంట్ ని దాటి బయటకు రాలేదు. జనాలలో చైతన్యం అయితే ఈ రోజుకీ లేదు. దాంతో పాటు ప్లాంట్ లో అంతా సవ్యంగా సాగుతోందా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా జేడీ కొత్త మార్గంలో స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వెల్దామంటున్నారు. అది మంచిదే. ఈ రకంగా అయినా జనాల్లో చైతన్యం వస్తే విరాళాల నుంచి ఉద్యమ దిశగా అడుగులు పడితేనే తెలుగు బిడ్డ ఊపిరి నిలుస్తుంది. లేకపోతే బిడ్ల రూపంలో ప్రైవేట్ పాలు కాక తప్పదనే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.