Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల‌పై జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ క్లారిటీ!

By:  Tupaki Desk   |   6 Oct 2018 9:34 AM GMT
రాజ‌కీయాల‌పై జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ క్లారిటీ!
X
త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయణ జ‌న‌సేన‌లో, బీజేపీలో చేర‌బోతున్నారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆర్ ఎస్ ఎస్ వాలంటీర్ల శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మానికి ల‌క్ష్మీ నారాయ‌ణ హాజ‌రైన నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీలో చేర‌బోతున్న‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. కానీ, తాను ఏ రాజ‌కీయ పార్టీలోనూ చేర‌డం లేద‌ని ల‌క్ష్మీ నారాయ‌ణ చాలాసార్లు చెప్పారు. త‌న‌కు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఉంద‌ని, వ్య‌వ‌సాయ మంత్రి అయితే రైతుల‌కు న్యాయం చేయ‌వ‌చ్చ‌ని గ‌తంలో అన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న రాజ‌కీయ అరంగేట్రంపై ల‌క్ష్మీనారాయ‌ణ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఈ ఉదయం తిరుప‌తిలో ఆయ‌న ప్రకటించారు. రైతు ఇబ్బందులు, గ్రామీణుల సమస్యలు, రైతుల పరిస్థితులపై అవగాహన కోసం 13 జిల్లాల్లో పర్యటించానని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో రైతు సమస్యల ప‌రిష్కారం అత్యంత ముఖ్యమని ఆయ‌న అన్నారు. రాబోయే 7 సంవత్సరాలు దేశానికి చాలా కీలకమన్నారు. గ్రామీణ ప్రాంతాలు కళావిహీనం అవుతున్నాయని, రైతుల‌కు ధరల స్థిరీకరణ నిధి కావాలని అన్నారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక పాలసీ తయారు చేస్తాన‌న్నారు. వారితో పాటు ప్ర‌తి వర్గానికీ నిర్దిష్టమైన పాలసీని రూపొందించానని, వాటి అమలు దిశగా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి కల్పన, అణగారిన వర్గాలకు చేయూత అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. త‌న రాజకీయ ప్రయాణంపై మిగ‌తా వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. వేరే పార్టీలతో పొత్తులపై ఇప్పుడే ఏమీ ఆలోచించడం లేదన్నారు. మొత్తానికి తాజాగా ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రంపై ఉన్న స‌స్పెన్స్ వీడిన‌ట్ల‌యింది. ఏ పార్టీతో పొత్తు ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే సొంత‌పార్టీ లాంచ్ చేయ‌బోతున్నార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదంటే ఆయ‌న ఇండిపెండెంట్ గా పోటీచేసే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.