Begin typing your search above and press return to search.

జేడీ మళ్లీ రెడీ... ?

By:  Tupaki Desk   |   30 Oct 2021 10:30 AM GMT
జేడీ మళ్లీ రెడీ... ?
X
ఆయన అసలు పేరు, ఇంటిపేరు వేరు. కానీ లోకానికి తెలిసిన పేరు జేడీ. ఆయన సీబీఐ జేడీగా చేసిన తరువాత పదోన్నతి మీద మహారాష్ట్రకు బదిలీ అయినా జేడీ లక్ష్మీనారాయణగానే ఫ్యామస్ అయ్యారు. ఇంకా చాలా సర్వీస్ ఉండగానే ఆయన పదవీ విరమణ తీసుకుని పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన తరఫున పోటీ చేసిన జేడీ బాగానే పోటీ ఇచ్చారు. కేవలం పది రోజుల ప్రచారం. ఎలాంటి ప్రలోభాలు లేవు. పైగా జనసేన కొత్త పార్టీ, సింబల్ కూడా తెలియదు, అయినా సరే పవన్ చరిష్మా, జేడీ వ్యక్తిగత ఇమేజ్ రెండూ కలసి ఆయన ఏకంగా రెండు లక్షల 80 వేల దాకా ఓట్లు సంపాదించి ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చారు. జేడీకి యూత్ లో విద్యావంతుల్లో ఈ రోజుకీ ఇమేజ్ ఉంది. అయితే ఆయన చివరి నిముషంలో బరిలో నిలబడడంతో ప్రచారంలో అనుకున్న దూకుడు లేకనే ఓడిపోయారు అన్న విశ్లేషణలు నాడు వినిపించాయి.

ఇక జేడీ తాను ఓడినా విశాఖను వీడిపోను అని నాడే చెప్పారు. దానికి తగినట్లుగానే ఆయన సిటీలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఉండడంతో ఇక మీదట విశాఖ నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని జేడీ డిసైడ్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద హై కోర్టులో కేసు ఫైల్ చేసి కేంద్రాన్ని లాగిన జేడీ స్థానిక సమస్యల మీద కూడా గట్టిగానే పోరాడుతున్నారు. తరచూ విశాఖలో మేధావులతో చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆయన మదిలో ఉన్న ఆలోచనల మేరకు చూస్తే మరోసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉందని అంటున్నారు. ఈసారి గురి తప్పకుండా పార్లమెంట్ లో అడుగుపెట్టాలని జేడీ భావిస్తున్నారుట. ఆయన అందుకే విశాఖనే టార్గెట్ చేశారు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జేడీ ఇపుడు ఏ రాజకీయ పార్టీలోనూలేరు. ఆయన ఆ మధ్యన జనసేనకు రాజీనామా చేశారు. అయితే పవన్ని ఒక్క మాట కూడా అనలేదు. దాంతో ఆయన పట్ల పవన్ కి జనసైనికులకు కూడా మంచి అభిప్రాయమే ఉంది అంటున్నారు. జేడీ కనుక వస్తే ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు కూడా జనసేన ఆసక్తిగా ఉందని అంటున్నారు. విశాఖలోని జనసేన నాయకులతో కూడా ఆయన ఈ రోజుకీ టచ్ లోనే ఉంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ నుంచి కూడా ఆయనకు ఇన్విటేషన్ ఉందని అంటున్నారు

బీజేపీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా ఆయనే పోటీలో ఉంటారు అన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జనసేనల మధ్యన పొత్తులు ఉండడం వల్ల జేడీ ఎంపీగా చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు, పైగా అంతా ఫుల్ సపోర్ట్ చేస్తారు. మరో వైపు చూస్తే టీడీపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి ఈ కూటమితో కలుస్తుంది అంటున్నారు. అదే జరిగితే జేడీ కచ్చితంగా ఈసారి ఎంపీ కావడం ఖాయమనే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అనేక రకాలైన ఫ్యాక్టర్స్ కూడా జేడీకి అనుకూలంగా మారుతాయని అంటున్నారు. మొత్తానికి జేడీని వెయిటింగ్ ఎంపీ అంటున్నారు అంతా.