Begin typing your search above and press return to search.

పొగరు అనే వైరస్ డిలీట్ చేయకుంటే ఎలా జేసీ?

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:45 AM GMT
పొగరు అనే వైరస్ డిలీట్ చేయకుంటే ఎలా జేసీ?
X
మారిన కాలానికి తగ్గట్లుగా మారాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. కాలం తనలో కలిపేసుకుంటుంది. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో ఉండే వారు మారిన పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారు కొన్నిసార్లు బొక్కబోర్లా పడుతుంటారు. దీనికి కారణం.. అప్ గ్రేడ్ కాకపోవటమే. పెద్దగా చదుకోకున్నా కాస్తంత కామన్ సెన్సు.. సమాజంలో చోటుచేసుకునే మార్పుల్పి పసిగట్టి.. ప్రజల మైండ్ సెట్ కుతగ్గట్లు మారి.. సక్సెస్ అయిన నేతలు చాలామంది కనిపిస్తారు.

గతంలో తోపులు చాలా తక్కువ మంది ఉండేవారు. ఆ మాటకు వస్తే.. అలా ఫీలయ్యేవారు. తమకు తాము తోపులమని తెలిసినా.. పెద్దగా బయటపడేవారుకాదు.ఇప్పుడు అలా కాదు. మొనగాళ్లు లాంటోళ్లు.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారు గతానికి భిన్నంగా అహంకారాన్ని వదిలేసి.. ప్రజలతో కలిసిపోవటం లాంటివి చేస్తూ.. ఇమేజ్ ను పెంచుకుంటున్నారు.
ఒకప్పుడు అనంతపురం జిల్లాలో తిరుగులేని రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబాల్లోజేసీ ఫ్యామిలీ ఒకటి.రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే.. అనంతపురం వరకు వచ్చేసరికి మాత్రం జేసీ ఫ్యామిలీతో పెట్టుకోవటం ఎందుకున్నట్లుగా ఉండేవారు. కానీ..కాలం మారింది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో లేనప్పుడు తగ్గి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి.. చేయాల్సిన తప్పులన్ని చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉండి వచ్చారు.

అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హయాంలో జైలుకు వెళ్లిన తాను.. మళ్లీ ఇన్నాళ్లకు వెళ్లాల్సి వచ్చిందంటేనే.. లెక్కలో తేడా కొడుతున్నట్లు కదా? ఆ విషయాన్ని మర్చిపోవటం ఒక తప్పు అయితే.. ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలన్న సింఫుల్ పాయింగ్ ను మర్చిపోవటం కొత్త చికాకులకు కారణంగా చెప్పాలి. పోలీసులతో దురుసగా వ్యవహరించటం.. వారి పట్ల అనవసరమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ద్వారా సాధించిందేముంది? మరోసారి అరెస్టు కావటం తప్పించి. పోలీసు అధికారులతో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై తాజాగా తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల మనోభావాల్ని దెబ్బ తీస్తే సహించేది లేదని.. చట్టపరంగా తగిన బుద్ధి చెబుతామన్నారు.

ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాలని.. లేదంటే చర్యలు తప్పవని చెప్పారు. బెయిల్ మీద విడుదలైన సందర్భంగా తన బలాన్ని ప్రదర్శించాలనుకోవటం బాగానే ఉన్నా.. కరోనా కాలంలో అది సరికాదన్న విసయాన్ని ఆయనే కాదు..ఆయన్ను అభిమానించేవారు మర్చిపోవటంతో విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించటంతో పాటు.. పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపటం చూస్తే.. ఒకప్పుడు తన వైపు చూసేందుకు భయపడినోళ్లు.. ఈ రోజున వరుస పెట్టి జైలుకు వెళ్లాల్సి వస్తుందంటే దానికి కారణం ఏమిటన్న విషయాన్నికాస్త ఆలోచిస్తే ఆయనకు ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. కాస్త మైండ్ సెట్ ను.. అందుకుఅవసరమైన చిప్ ను కాస్తంత అప్ గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది.