Begin typing your search above and press return to search.

జేసీ సోదరుడి అరెస్టుపై బాబు రియాక్షన్.. ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   13 Jun 2020 10:15 AM IST
జేసీ సోదరుడి అరెస్టుపై బాబు రియాక్షన్.. ఏం చెప్పారంటే?
X
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా.. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బలమైన నేతల్ని వేర్వేరు కేసుల మీద అరెస్ట్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఈ వైనంపై టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా స్పందించారు. తమ పార్టీ నేతల్ని అరెస్టు చేసిన వైనంపై తనదైన రీతిలో భాష్యాన్ని చెప్పుకొచ్చారు. మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేయగా.. తప్పుడు పత్రాలతో పెద్ద ఎత్తున వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడ్ని ఈ రోజు ఉదయం అనంతపురం పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేయటం తెలిసిందే.

ఈ ఉదంతంపై చంద్రబాబు స్పందించారు. అరెస్టు చేయటాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని.. ప్రజా సమస్యలపై టీడీపీ చేస్తున్న పోరాటాన్ని సహించలేకనే ఇలాంటివన్నీ ఆయన చేస్తున్నట్లు తప్పు పట్టారు. ఏడాది పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడు.. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులు చేస్తున్నట్లు ఆరోపించారు.

తాను జైలుకు వెళ్లిన అక్కసుతోనే టీడీపీ నేతలపై కక్ష పెంచుకున్న జగన్.. తమ పార్టీ నేతల్ని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి తీరుతో తమ పార్టీ నేతల్ని భయపెట్ట లేరంటున్నారు. జగన్ కక్ష సాధింపు చర్యల్ని అన్ని వర్గాల వారుఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.