Begin typing your search above and press return to search.

ఎంపీ వద్దు.... ఎమ్మెల్యే ముద్దు: జెసీ పవన్

By:  Tupaki Desk   |   25 Feb 2019 4:15 AM GMT
ఎంపీ వద్దు.... ఎమ్మెల్యే ముద్దు: జెసీ పవన్
X
రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అని మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటారా... ఇవాళ మాట్లాడిన మాటలు రేపు ఉండటం లేదు. నిన్నటి ప్రకటనలకు విలువ ఉండటం లేదు. రేపటి వాగ్దానాలకు హామీ ఉండటం లేదు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా!. ఇంకెవరు అనంతపురం లోక్ సభ సభ్యుడు - సీనియర్ రాజకీయ నాయకుడు జెసీ దివాకర్ రెడ్డి కుమారుడు జెసీ పవన్ కుమార్ రెడ్డి గురించి. నిన్నటి దాకా అనంతపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకు వచ్చిన పవన్ కుమార్ రెడ్డి హఠాత్తుగా ప్లేటు ఫిరాయించారు. తాను లోక్ సభ సభ్యుడిగా పోటీ చేయనని - అనంతపురం ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ కొత్త కోరికను ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అనంతపురం లోక్ సభ సభ్యుడు జెసీ దివాకర్ రెడ్డి తన స్థానంలో తన కుమారుడు చేత పోటీ చేయించాలని భావించారు. ఇదే విషయమై తన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ను తరచూ కలుస్తూ తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. అంతేకాదు అనంతపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని కూడా ఈయన పట్టు బడుతున్నారు.

ఈ విషయమై తర్జనభర్జనలు పడుతున్న సమయంలో దివాకర్ రెడ్డి కుమారుడు జెసీ పవన్ కుమార్ రెడ్డి తాను అనంతపురం ఎంపీ బరిలో ఉండనని - శాసన సభ్యుడిగా పోటీ చేస్తానంటూ తన మనసులోని కోరికను వెల్లడించారట.ఇంతకీ అనంతపురం ఎంపి స్థానాన్ని కుమార్ రెడ్డి వదులుకోవడానికి కారణం ఏమిటి అని పలువురు తమ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏమీ లేదట. అనంతపురం లోక్ సభ స్థానం పై మూడు వేర్వేరు మార్గాలలో పవన్ కుమార్ రెడ్డి సర్వేలు చేయించారట. ఆ సర్వేలో లోక్ సభ సభ్యుడిగా ఆయన ఓటమి పాలవడం ఖాయమని తేలిందట. దీంతో లోక్ సభ స్థానం కంటే శాసనసభ స్థానం మెరుగని భావించిన పవన్ కుమార్ రెడ్డి అనంతపురం శాసనసభ స్థానం కేటాయించాలంటూ తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు కోరుతున్నారని సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోతే గుంతకల్లు స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పవన్ కుమార్ రెడ్డి కోరుతున్నారట. తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు తమ కోరికను మన్నిస్తే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయకుండా తప్పుకుంటామని సన్నిహితుల వద్ద దివాకర్ రెడ్డి అన్నట్లు సమాచారం. మరి ఈ తండ్రీ కొడుకుల ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు తిరస్కరిస్తారో లేదు అంగీకరిస్తారో వేచి చూడాల్సిందే.!!