Begin typing your search above and press return to search.

పార్టీ మారే అంశంపై సీరియస్ గా ఆలోచిస్తున్న జేసీ!?

By:  Tupaki Desk   |   11 Dec 2020 12:35 PM IST
పార్టీ మారే అంశంపై సీరియస్ గా ఆలోచిస్తున్న జేసీ!?
X
చేతిలో అధికారంలో ఉన్నప్పుడు తమకిక ఎదురులేదన్నట్లు వ్యవహరించే చాలామంది నేతలు.. చేతిలో ఉన్న పవర్ పోయిన తర్వాత తమ పరిస్థితిని చూసుకొని వేదన చెందుతుంటారు. దీనికి కారణం.. చేతిలో అధికారం ఉన్నప్పుడు.. అదంతా తమకున్న సామర్థ్యంతోనే సాధ్యమవుతుందని భావించటంగా చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికార బదిలీ సాగటం.. ఊహించిన దాని కంటే మిన్నగా ప్రజలు తీర్పు ఇవ్వటంతో.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటినుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలతో టీడీపీ నేత.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. తనకు తోచినట్లుగా వ్యాపారాలు చేసిన జేసీ.. జగన్ సీఎం అయ్యాక చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికి ఆయన చేసిన దందాలు.. మోసాలు బయటకు వచ్చాయి. వాటిని ఎత్తిచూపించినంతనే ఇరిటేట్ కావటం.. కొత్త కేసులు మీద పడుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ మారే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకురాజకీయ రక్షణ అవసరమని భావిస్తున్న జేసీ.. ఏపీ బీజేపీలో తీర్థం తీసుకునే అవకావం ఉందంటున్నారు. ఏపీ బీజేపీ టీడీపీకి చెందిన నేతలతో నిండుతోంది. అయితే.. అధికారికంగా జేసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. జేసీ పార్టీ మారే అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంద. ఇదిలా ఉంటే.. జేసీ పార్టీ మారే ఆలోచన చేయరన్న మాట కొందరి నోట వినిపిస్తోంది.

గతంలోనే బీజేపీలోకి చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన జేసీ.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు తనను బీజేపీలోకి రావాలని కోరుతున్నట్లు గతంలో చెప్పారు. గతంలో తాము కలిసినప్పుడు పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తే.. తాను సున్నితంగా తిరస్కరించిన వైనాన్ని గుర్తు చేయటాన్ని మర్చిపోకూడదు. రాష్ట్రంలో తమకుంటూ ఒక చరిత్ర ఉందని.. తొందరపడి నిర్ణయాలు తీసుకునే వీల్లేదన్నారు. ఇలాంటి మాటలు చెప్పిన జేసీ.. ఇప్పుడు అంత సులువుగా పార్టీ మారాలన్న యోచనకు వస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.