Begin typing your search above and press return to search.

వైఎస్ మ‌ర‌ణం ముందురోజు నాతో ఆ మాట చెప్పారు

By:  Tupaki Desk   |   4 Sep 2017 5:22 AM GMT
వైఎస్ మ‌ర‌ణం ముందురోజు నాతో ఆ మాట చెప్పారు
X
ఏదైనా విష‌యం గురించి అడ‌గాలే కానీ చెప్పేందుకు ఏ మాత్రం మొహ‌మాటానికి గురి కారు ఏపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌న్నా.. ప్ర‌త్యేక హోదా వ‌చ్చేది లేదని తేల్చేసినా జేసీకే చెల్లుతుంది. కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు మాట్లాడే త‌త్త్వం ఉన్న ఆయ‌న తాజాగా ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు.

రెండోసారి ముఖ్య‌మంత్రిగా వైఎస్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత త‌న కేబినెట్ లో జేసీకి స్థానం ఇవ్వ‌లేదు. దీంతో.. వైఎస్‌.. జేసీల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌న్న మాట ప్ర‌చారం ఉంది. ఈ మాట‌లో నిజం ఎంత‌? జేసీ లాంటి సీనియ‌ర్‌ కు వైఎస్ ఎందుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు? దీనిపై జేసీ రియాక్ష‌న్ ఏంది? వైఎస్ తో త‌న ఆవేద‌న‌ను జేసీ పంచుకున్నారా? వైఎస్ రియాక్ష‌న్ ఏమిటి? లాంటి ప్ర‌శ్న‌కు జేసీ త‌న‌కు తానే స‌మాధానాన్ని తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

'ఏదైనా రావాలంటే వెతుక్కుంటూ వ‌స్తుంది.. రాకూడ‌దంటే అస్స‌లు రాదు. రెండోసారి త‌న కేబినెట్ లోకి వైఎస్ న‌న్ను తీసుకోలేదు. ప‌ద‌వి ఎందుకు ఇవ్వ‌లేదో తెలుసుకుందామ‌ని నేనే ఆయ‌నింటికి వెళ్లా. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌టానికి మీ జిల్లా వాళ్లే కార‌ణ‌మంటూ కొన్ని ఫిర్యాదుల్ని చూపించాడు. వాటిని చూసి ఆయ‌న‌కు అన్ని వివ‌రించా. వైఎస్ సంతృప్తి వ్య‌క్తం చేశారు. న్యాయం చేస్తామ‌న్నాడు'

వైఎస్ మ‌ర‌ణానికి ఒక్క‌రోజు ముందు న‌న్ను ఆయ‌న పిలిపించుకున్నారు. మేడంతో తాను మాట్లాడాన‌ని.. ఒప్పించాన‌ని.. కేబినెట్ లో తీసుకుంటామ‌న్నారు. తాను చిత్తూరుకు పోతున్నాన‌ని.. రాగానే మంచిరోజు చూసుకొని మంత్రివ‌ర్గంలో తీసుకుంటామ‌న్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న వెళ్లిపోయార‌న్నారు.

తాను విధిని న‌మ్ముతాన‌ని.. ఏదైనా మ‌న‌కు రాలేద‌ని ఏడ‌వ‌కూడ‌ద‌ని.. ఏడిస్తే లాభం ఉండ‌ద‌న్న‌ది త‌న ప‌ద్ద‌తిగా చెప్పారు. త‌న‌కు ఓట‌మి అన్న‌దే లేద‌ని.. అన్నీ ఉన్నాయని.. అన్ని చాలా సంతోషాన్నిస్తుంద‌న్నారు. అయితే.. త‌న భార్య అనారోగ్యం ఒక్క‌టే త‌న‌ను బాధిస్తుంద‌ని చెప్పారు. అంద‌రికి అన్ని ఉన్నా ఏదో ఒక లోటు లేకుండా ఉండ‌ద‌ని అంటారు. అది.. ఇదేనేమో?