Begin typing your search above and press return to search.

పవన్ లాంటి వాళ్ల నోర్లు మూయించడానికే!

By:  Tupaki Desk   |   23 July 2015 10:00 AM GMT
పవన్ లాంటి వాళ్ల నోర్లు మూయించడానికే!
X
తమ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో తెలుగుదేశం నాయకులకు పెద్ద తలనొప్పే వచ్చి పడింది. చురుక్కుమనే కామెంట్లతో ఎప్పటికప్పుడు తెలుగుదేశం గాలి తీసేయడానికి ఆయన తయారైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గురువారం పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా ఒకటి చేపట్టి.. ఏదో హడావుడి చేద్దామని ప్రయత్నం చేశారు. ఈ ధర్నాలో జేసీ కూడా పాల్గొన్నారు కూడా. ఐతే పాల్గొన్నవాడు సైలెంటుగా ఉండకుండా ఆణిముత్యాల్లాంటి మాటలు మాట్లాడారు.

‘‘ప్రజా ప్రతినిధులు చేసే ధర్నాలన్నీ ప్రజలను మభ్యపెట్టే కంటితుడుపు చర్యలే’’ అని వ్యాఖ్యానించి.. తాము చేపట్టిన ధర్నాకు విలువే లేకుండా చేసేశారు. అంతటితో ఆగితే పోయేది. కానీ జేసీ ఎక్కడాగుతారు. ‘‘పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూయించడానికే ఇలాంటి ధర్నాలు ఉపయోగపడతాయి’’ అంటూ మరో సెన్సేషనల్ కామెంట్ విసిరారు. మంత్రాలకు చింతకాయలు రాలవని చెప్పడం ద్వారా ఇలాంటి ధర్నాలతో ప్రత్యేక హోదా రాదని చెప్పకనే చెప్పేశారు జేసీ. ఈ కామెంట్లన్నీ సరే కానీ.. ఇలాంటి అభిప్రాయాలున్న వాడు ఆ ధర్నాలో మాత్రం ఎందుకు పాల్గొన్నాడో మరి. వాస్తవాలు చెప్పాలనుకున్నపుడు ధర్నాలో పాల్గనకుండా ఉండాల్సింది. ధర్నాకు వెళ్లాక సైలెంటుగా అయినా ఉండాల్సింది. ధర్నాలో పాల్గొని ఇలాంటి కామెంట్లు చేసి పార్టీ పరువు తీయడం దేనికి?