Begin typing your search above and press return to search.

‘బాబు ప్రయత్నం’ మీద జేసీ పంచ్

By:  Tupaki Desk   |   7 April 2016 4:15 AM GMT
‘బాబు ప్రయత్నం’ మీద జేసీ పంచ్
X
అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేయటానికి ఏ మాత్రం సంశయించని నేతల్లో ఏపీ అధికారపక్షానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారమే కాస్తంత డిఫరెంట్ అన్న సంగతి తెలిసిందే. తాను మాట్లాడిన ప్రతిసారీ వార్తల్లో ప్రముఖంగా కనిపించే అలవాటున్న జేసీ.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారటమే కాదు.. అధినేత మీద నర్మగర్భంగా పంచ్ లు వేసిన మాట వినిపిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా రాదంటే రాదన్న చేదు వాస్తవాన్ని ఎప్పుడో చెప్పేసిన ఆయన తాజాగా మరో జోస్యాన్ని చెప్పుకొచ్చారు.

2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదన్నది కుండ బద్ధలు కొట్టారు. ఏపీలో కొత్తగా 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయన్న అంచనా మీద తనదైన శైలిలో పంచ్ వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదు కానీ.. యాభై నియోజకవర్గాల్ని మాత్రం పెంచేస్తారా? అంటూ ప్రశ్నించారు.

త్వరలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో.. ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షానికి చెందిన ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఆహ్వానించటంతో పాటు.. వారందరికి పెరిగే అవకాశం ఉన్న స్థానాల్లో సర్దుబాటు చేయాలన్న ఆలోచనపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు లేదన్న ఆయన.. వెంకయ్య.. చంద్రబాబులు కోరుకుంటే మాత్రం పెరిగిపోతాయంటూ కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే.. పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పై జేసీ గుర్రుగా ఉన్నట్లుగా చెబుతున్నారు.