Begin typing your search above and press return to search.

జేసీ సంచ‌ల‌నం!... బాబుకు ఆ స‌త్తా లేద‌ట‌!

By:  Tupaki Desk   |   6 Feb 2019 4:29 AM GMT
జేసీ సంచ‌ల‌నం!... బాబుకు ఆ స‌త్తా లేద‌ట‌!
X
కేంద్రంలో న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారును కూల్చేదాకా నిద్ర‌పోను. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీని గ‌ద్దె దించి తీరుతా. పీఎం పీఠంపై రాహుల్ గాంధీని కూర్చోబెడ‌తా... ఈ మాట‌లు ఇటీవ‌లి కాలంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నోట నుంచి ప‌దే ప‌దే వ‌స్తున్నాయి. అయితే మోదీని గ‌ద్దె దించ‌డం మాట దేవుడెరుగు గానీ... రాహుల్ ను మాత్రం పీఎం కుర్చీలో కూర్చోబెట్టే స‌త్తా మాత్రం బాబుకు లేద‌ట‌. ఈ మాట ఏ టీడీపీ వైరి వ‌ర్గం నుంచో దూసుకురాలేదు. నేరుగా టీడీపీ నుంచే ఈ మాట వినిపించింది. చంద్ర‌బాబు ప‌రువును బ‌జారుకీర్చేలా వ‌చ్చిన ఈ కామెంట్ ఎవ‌రి నోట నుంచి వ‌చ్చిందంటారా? ఇంకెవ‌రండీ బాబూ... బాబుకు ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా మ‌న‌సులో ఉన్న మాట‌ను నిర్భ‌యంగా చెప్ప‌గ‌లిగిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డే.

బ‌హిరంగ వేదిక‌ల మీద చంద్ర‌బాబు ఆసీనులై ఉన్న‌ప్పుడు... త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేసి... ఆ మాట వింటే బాబు ఏమైనా బాధ‌ప‌డ‌తారేమోన‌న్న కించిత్ ఆలోచ‌న కూడా లేకుండా త‌న‌దైన శైలి చూపే జేసీ నిన్న ఈ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అది కూడా ఎక్క‌డ‌నుకుంటున్నారు? దేశ రాజ‌ధాని ఢిల్లీలో. అయినా జేసీ ఇంత మాట ఎలా అన్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఎంతైనా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉండి వ‌చ్చిన నేత‌గా జేసీ ఆ పార్టీలోని అన్ని లోగుట్లు - ఆ పార్టీ బ‌లాబ‌లాలు - పార్టీ నేత‌ల బ‌లాబ‌లాలు అన్నీ తెలుసు క‌దా. ఈ క్ర‌మంలోనే మ‌రో మూడు నెలల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మిని ఎదుర్కొని నిల‌బ‌డ‌టం కాంగ్రెస్ కు చేత కాద‌న్న విష‌యం జేసీతో పాటు అంద‌రికీ తెలిసిందే. అంతేకాకుండా ఇప్ప‌టిదాకా జ‌రిగిన స‌ర్వేలన్నీ కూడా క్లిస్ట‌ర్ క్లియ‌ర్ మెజారిటీ రాకున్నా... తిరిగి మోదీనే పీఎం పీఠం ఎక్కేందుకే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని - కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించే అవ‌కాశాలేమీ క‌నిపించ‌డం లేద‌ని తేల్చేసిన సంగ‌తి కూడా తెలిసిందే. ఈ క్ర‌మంలో కాస్తంత వాస్త‌వాల‌ను ఏమాత్రం మొహ‌మాటం లేకుండా చెప్పేసే జేసీ... నిన్న ఢిల్లీలో టీడీపీ ఎంపీల దీక్ష‌ల సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు సత్తా ఏమిటో తేల్చేశారు.

అయినా ఈ దిశ‌గా జేసీ ఏమ‌న్నారన్న విష‌యానికి వ‌స్తే... *రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయితే... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ సీడ‌బ్ల్యూసీ లో తీర్మానం చేసింది. అందుకే త‌మ నేత రాహుల్ తో క‌లిసి అడుగులేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్ర‌ధాని కాగ‌లిగే స‌త్తా లేద‌నే అనుకుంటున్నాను. దీంతో రాహుల్ ప్ర‌ధాని కాలేరు. ఆయ‌న‌ను ప్ర‌ధానిని చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు మాట నెర‌వేర‌దు* అంటూ జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ప‌నిలో ప‌నిగా ప్ర‌ధాని మోదీపైనా త‌న‌దైన స్టైల్లో విరుచుకుప‌డిన జేసీ... మోదీ ఓ ఫ్యాక్ష‌న్ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంపై క‌క్ష తీర్చుకునే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోదీ... ఆ కార‌ణంగానే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేస్తున్నార‌ని ఆరోపించారు. మోదీపై జేసీ వ్యాఖ్య‌లు వెరీ కామ‌నే గానీ... చంద్ర‌బాబు స‌త్తాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.