Begin typing your search above and press return to search.

జనసేనకు ఒక్క సీటూ రాదన్న టీడీపీ ఎంపీ!

By:  Tupaki Desk   |   30 March 2019 8:18 AM GMT
జనసేనకు ఒక్క సీటూ రాదన్న టీడీపీ ఎంపీ!
X
రాయలసీమ వరకూ జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అని అంటున్నారు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మిగతా చోట్ల సంగతి తనకు తెలియదని, అక్కడ ఆ పార్టీకి సీట్లు వస్తాయో రావో కానీ.. రాయలసీమలో మాత్రం ఒక్క సీటు కూడా రాదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయంగా హాట్ హాట్ ప్రకటనలు చేయడంలో జేసీ దివాకర్ రెడ్డి రూటే వేరు. ఇలాంటి నేపథ్యంలో జనసేన విషయంలో ఈ విధమైన ఒపీనియన్ ను ఓపెన్ గానే చెప్పేశారు దివాకర్ రెడ్డి.

తను రాజకీయ సన్యాసం తీసుకోలేదని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తను ప్రజా జీవితంలోనే ఉన్నట్టుగా ఆయన చెప్పారు. దివాకర్ రెడ్డి తనయుడు పవన్ అనంతపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తనయుడు ఎంపీగా విజయం సాధించడం ఖాయమని జేసీ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తన తమ్ముడు కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా నెగ్గుతారని అన్నారు.

జేసీ సోదరులు ఇద్దరూ ఇప్పుడు ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకున్నారు. తనయులకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు వారికి మరింత కీలకంగా మారాయి.

అనంతపురం తెలుగుదేశం పార్టీ విభాగంలో అంత సమన్వయం కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో ఈ అంశం మీద కూడా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలను మార్చాలని తను డిమాండ్ చేసిన సంగతి వాస్తవమే అని, అయితే ఆ మేరకు మార్పులు జరగలేదన్నారు.

ఒకవేళ మార్చని వారు నెగ్గితే అప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్టే అవుతుందని, అలా కాక వారు ఓడిపోతే అప్పుడు తను చెప్పింది వాస్తవం అవుతుందని జేసీ వ్యాఖ్యానించారు. మొత్తానికి తను చెప్పిన మార్పులు చేయకపోవడం విషయంలో పార్టీ తీరుపై దివాకర్ రెడ్డి కాస్త అసహనంతోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది!